13 March, 2026 | 3:09 AM

అబద్ధాలతో అధికారంలోకి కాంగ్రెస్

13-03-2026 01:33 AM
  1. అన్ని పథకాలకు స్వస్తి పలికింది
  2. మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారు.. రంజాన్ తోఫా అందిస్తారు
  3. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): అబద్ధాలతో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అన్ని పథకాలకు స్వస్థి పలికిందని మండిపడ్డారు. గురువారం సోమాజిగూడలో మాజీ ఎమ్మెల్సీ సలీం ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా రేషన్ కిట్‌లను పంపిణీచేశారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ హాజరై పేద ముస్లిం మహిళలకు రంజాన్ రేషన్ కిట్‌లను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అల్లా దయతో అందురూ రంజాన్ సంతోషంగా జరుపుకోవాలని ఆకాక్షించారు. కేసీఆర్ పాలనలో ప్రతి పేద ముస్లింలకు రంజాన్ తోఫా ఇచ్చామని, ప్రతి పేద ముస్లిం అమ్మాయి పెళ్లి అయితే షాదిముబారక్ లక్షా నూట పదహారు రూపాయలు ఇచ్చామని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాలన్నింటినీ నిలిపేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

కేవలం పేద ఇండ్లపై బుల్డోజర్ మాత్రం పంపిస్తున్నారని ఎద్దేవాచేశారు. లోకల్ ఎమ్మెల్యే మిమ్మల్ని మోసం చేసి కాంగ్రెస్‌లో చేరారని మండిపడ్డారు. తప్పకుండా మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తుందని, కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తంచేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మళ్లీ రంజాన్ తోఫా ప్రతి ముస్లింలకు అందజేస్తామని హామీ ఇచ్చారు.

లైసెన్స్‌డ్ సర్వేయర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి

లైసెన్స్‌డ్ సర్వేయర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా లైసెన్స్‌డ్ సర్వేయర్లుగా దాదాపు 5 వేలకుపైగా నియమించినా నెలల తరబడి అటు పని, ఇటు జీతభత్యాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని గురువారం కేటీఆర్‌ను కలిసి తమ ఆవేదన వ్యక్తంచేశారు.

ధరణి స్థానం లో పేరుకు భూభారతిని తీసుకొచ్చినప్పటికి అందులో భాగంగా ఎంపిక చేసిన లైసెన్స్‌డ్ సర్వేయర్లకు మాత్రం అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. కర్ణాటకలో సర్వేయర్లకు ప్రతినెల గౌరవప్రదమైన ఆదాయం వచ్చేలా ఏర్పాట్లు చేశారని, కానీ తెలంగాణలో మా త్రం కాంగ్రెస్ సర్కారు అన్యాయం చేస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు.

ఈ మేరకు తమకు ఎదురవుతున్న రెండు ప్రధాన సమస్యలతోపాటు ఇతర అంశాలపై కేటీఆర్‌కు వినతిపత్రం సమర్పించారు. తమకు లైసెన్స్‌డ్ పత్రాలు ఇచ్చి నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు జీతభత్యాల గురించి పట్టించుకోకుండా తమ కుటుంబాలను రోడ్డున పడే శారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతి లైసెన్స్‌డ్ సర్వేయర్‌కు సమానంగా, పారదర్శకంగా పనులను కేటాయించేలా సమగ్ర విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.