కుల రాజకీయం!

01-05-2024 12:09:47 AM

ఈ ఎన్నికల్లో సామాజిక అంశాలే కేంద్ర బిందువు

కులగణనే తమ ప్రధాన అజెండా అంటున్న కాంగ్రెస్

సమాజాన్ని చీల్చే కుట్ర అంటూ తిప్పికొడుతున్న బీజేపీ

వారసత్వపు పన్ను దేశానికి ప్రమాదకరమని హెచ్చరిక

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సామాజిక న్యాయం, కుల వర్గీకరణ, రిజర్వేషన్ల అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ఎన్నికల్లోనూ ఇవే అంశాలు కేంద్ర బిందువుగా మారాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వీటినే ప్రధాన ప్రచారాస్త్రాలుగా ఉపయోగిస్తోంది. కులగణన చేపట్టి రిజర్వేషన్ల పరిధిని విస్తృతం చేస్తామని, ఇప్పటికే ఉన్న కోటాను పొడిగిస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేస్తోంది. ఈ అంశం ప్రస్తుతం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. కులగణనతోనే సామాజిక న్యాయానికి పునాది పడుతుందని కాంగ్రెస్ చెబుతోంది. 

కులగణనను ఎవరూ ఆపలేరు.. 

అయితే ఈ విషయంలో బీజేపీ మొదటి నుంచీ సందిగ్ధంలోనే ఉంది. సామాజిక న్యాయం కులగణనతోనే సాధ్యం కాదని విపక్షాలపై ఎదురుదాడి చేస్తోంది. తీసుకొచ్చిన పథకాల ద్వారా మౌలిక వసతులతో పాటు జీవన ప్రమాణాలను పెంపొందించామని, వీటితోనే సామాజిక న్యాయం సాధ్య మని కాషాయ పార్టీ ఉద్ఘాటిస్తోంది. కానీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మాత్రం ప్రత్యేకంగా రిజర్వేషన్లు, కులగణనపైనే దృష్టి సారించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోను సమర్థిస్తూ కులగణన చేపట్టేందుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. ఈ గణనను జాతీయ ఎక్స్‌రేగా పేర్కొంటూ.. 90 శాతం మంది భారతీయులకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని, అధికారంలోకి రాగానే మొదట తీసుకునే నిర్ణయం ఇదేనని వెల్లడించారు. కులగణన నాకు రాజకీయ అంశం కాదు. అదే నా జీవిత లక్ష్యం. ప్రపంచంలో ఏ శక్తి కూడా కులగణనను ఆపలేదు అని స్పష్టం చేశారు. 

అయితే, ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరుకోవడంతో కులం, రిజర్వేషన్లు, ఆస్తుల పునఃపంపిణీపై చర్చ మరింత వేడెక్కుతోంది. రెండు జాతీయ పార్టీలు ప్రధానంగా ఈ విషయాలపైనే ఫోకస్ చేస్తున్నాయి. ముందుగా కాంగ్రెస్ వీటిని తెరపైకి తీసుకొచ్చినప్పటికీ, బీజేపీ బలంగా వ్యతిరేకిస్తోంది. ఈ చర్చల నడుమ జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపుతారో వేచిచూడాల్సి ఉంది.

మతపరంగా సమాజాన్ని చీల్చేందుకే.. 

వివాదాస్పదమైన ఆస్తి పునర్విభజనపైనా రాహుల్ స్పష్టమైన అవగా హనతో ఉన్నారని కాంగ్రెస్ చెబుతోంది. దేశంలో ఎవరికి ఎంత అ న్యాయం జరిగిందో గుర్తించడం అత్యవసరమని రాహుల్ పేర్కొన్నారు. ఈ విషయంలో బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ప్రజలు కష్టపడిన సొమ్మును స్వాధీ నం చేసుకోవడం అన్యాయమని ప్రతిఘటిస్తోంది. దేశంలో కులమతాల మధ్య చీలికలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోంది. కాంగ్రెస్ మ్యానిఫెస్టో మతపరమైన మైనారిటీలకు ఉద్యోగాల్లో, సైన్యంలో రిజర్వే షన్లు కల్పించాలని చెబుతోందని మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. కాంగ్రెస్ చెబుతున్న విధానం దేశ ఐక్యతను దెబ్బతీస్తుందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీ సీ వర్గాల రిజర్వేషన్లు తగ్గించి మైనారిటీ కోటాలో కాంగ్రెస్ ప్రయోగాలు చేసిందని, కానీ వాటిని కోర్టు తిరస్కరించిందని గుర్తుచేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో రంగనాథ్ మిశ్రా కమిషన్‌ను ప్రస్తావిస్తూ ఓబీసీలకు సంబంధించిన 27 శాతం కోటా లో 6 శాతం ముస్లింలకు, 2 శాతం ఇతర మైనారిటీలకు కేటాయించాలని సిఫార్సు చేసినట్లు తెలిపారు.