ప్రభుత్వం బాజా భజయించే వాళ్లు ఉండాలె: కేటీఆర్
హైదరాబాద్: ఎన్నికల సమయంలో క్వింటాల్ కు వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామని, ఇప్పుడు సన్నబియ్యానికి మాత్రమే ఇస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. వరంగల్ - నల్గొండ - ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండలో జరిగిన పార్టీ సన్నాహాక సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వమని.. సన్న వడ్లకు మాత్రమే ఇస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే తప్పకుండా మీరు తీర్పును ఇవ్వాలన్నారు. ఎన్నికల ప్రచారంలో 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన వాళ్లకు ఓటేద్దామా? పదేళ్ల పాటు నిజాయితీ గా పనిచేసిన కేసీఆర్ అభ్యర్థికి ఓటు వేద్దామా? అని ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ అన్నారు. వాటి ఊసేలేదు, కానీ సిగ్గు లేకుండా 30 వేల ఉద్యోగాలు ఇచ్చినా అని రేవంత్ రెడ్డి చెబుతున్నారని ఆరోపించారు.
కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలను తాను ఇచ్చిన అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండానే 30 వేల ఉద్యోగాలు ఇచ్చిన అని మనల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మెగా డీఎస్సీ అన్నారు. ఎంట్రన్స్ పరీక్షకు ఫీజే పెట్టం అన్నారు. కానీ ఇప్పుడు టెట్ పరీక్ష కోసం ఐదు రెట్లు ఫీజు పెంచి రూ. 2 వేలు వసూలు చేస్తున్నారని విమర్శించారు. గెలిచే వరకు ఒక మాట. గెలిచిన తర్వాత మరొక మాట. ఇలాంటి ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసేలా నిలదీయాలంటే ప్రశ్నించే వ్యక్తులు కావాలె. మీ తరఫున కొట్లాడాలంటే... ప్రభుత్వాన్ని నిలదీయాలంటే మీరు మాకు బలం ఇవ్వాల్సిన అవసరముందన్నారు.
ఆరు నెలల్లోనే ఈ ప్రభుత్వం రైతులు, మహిళలు, నిరుద్యోగులు, పెద్దమనుషులు ఇలా ప్రతి వర్గాన్ని మోసం చేసిందన్నారు. ఐదు నెలల్లోనే ఐదేళ్ల అపఖ్యాతి మూటగట్టుకున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించి...అందరినీ మోసం చేసిన ప్రభుత్వానికి మళ్లీ ఓటు వేద్దామా? ఆలోచించండన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ తినే పళ్లెంలో మన్ను పోసుకున్నామన్నట్లుగా బాధపడుతున్నారని తెలిపారు. ఒక వైపు విద్యావంతుడు, గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి ఉన్నాడు. అమెరికాలో ఉండి ఎంతో సంపాదించుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రజాసేవ కోసం వచ్చిన వ్యక్తి రాకేష్ రెడ్డి అన్నారు. తెల్లారి లేస్తే బూతులు మాట్లాడటం, పెద్దవాళ్లను తిడితే పెద్దోన్ని అవుతానని ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం, బెదిరించటం, బ్లాక్ మెయిల్ చేసే వ్యక్తి మరొక వైపు ఉన్నాడు. 56 కేసులు, 74 రోజులు చంచల్ గూడ జైల్లో ఉన్నఅనుభవం ఉందన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుణగణాలు. ఓ విద్యావంతుడుకి పట్టం కడతారా ఒక బ్లాక్ మెయిలర్, చీటర్ కు పట్టం కడతారా? ఆలోచించండని కోరారు.
శాసన మండలిలో యోగ్యులు, అర్హులకు అవకాశం ఇవ్వాలన్నారు. బ్లాక్ మెయిలర్లు, దందాలు చేస్తూ బెదిరించే వాళ్లకు అవకాశం ఇవ్వొద్దని కోరారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి లు కూడా ఆలోచించుకోవాలె. ఇలాంటి చీటర్లను, బ్లాక్ మెయిలర్లను ప్రోత్సహిస్తే రేపు మీకే ఎసరు పెడుతారని చమత్కరించారు. సమాజానికి పట్టిన చీడపురుగు, దొంగను ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.






