calender_icon.png 1 November, 2024 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ విఫలం

12-05-2024 12:35:34 AM

పెట్టుబడి సాయం నాట్లేసేటప్పుడు ఇవ్వాలె.. ఎన్నికల వచ్చినప్పుడు కాదు..

పెద్దపల్లిలో ఆగర్భశ్రీమంతుడికి, ప్రజాసేవకుడి మధ్యే పోటీ

బీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ను ప్రజలు గెలిపించుకోవాలి

చెన్నూర్ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

మంచిర్యాల, మే 11 (విజయక్రాంతి): ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విజయాన్ని కాంక్షిస్తూ శనివారం మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభ, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. పెద్దపల్లిలో ఆగర్భ శ్రీమంతుడికి, ప్రజాసేవకుడికి మధ్య పోటీ నడుస్తున్నదన్నారు.

ప్రజలు ఆలోచించి సింగరేణి కార్మికుడు, గుణవంతుడైన కొప్పుల ఈశ్వర్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఐదు నెలలైందని, ఆరు గ్యారెంటీల్లో ఒక్క గ్యారెంటీనైనా పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. కల్యాణలక్ష్మి, తులం బంగారం, మహిళలకు రూ.2500 ఏమయ్యాయని ప్రశ్నించారు. డిసెంబర్ 9 తర్వాత రూ.2 లక్షల రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. రైతులకు మొండి చేయి ఇచ్చినోళ్లకు ప్రజజలు ఓటుతోనే గుణపాఠం చెప్పాలన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి బీఆర్‌ఎస్‌కు 10 ఎంపీ సీట్లు వస్తే మళ్లీ కేసీఆర్ రాజకీయాలను శాసిస్తారన్నారు.

లక్షల ఎకరాలకు నీరిచ్చే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని, ఆ పని పక్కనపెట్టి రాష్ట్రానికి ఎక్కువ నిధులు తెచ్చి ప్రజల మనసు గెలుచుకోవాలని హితవు పలికారు. పెట్టుబడి సాయం నాట్లేసేటప్పుడు ఇవ్వాలే కానీ, ఓట్లేసటప్పుడు కాదని ధ్వజమెత్తారు. పదేండ్లలో ప్రజలకు, రాష్ట్రానికి ప్రధాని మోదీ చేసింది ఏమి లేదన్నారు. పదేళ్ల క్రితం బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉంటే ఇప్పుడు రూ.వెయ్యి దాటిందన్నారు. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే  అది కాస్తా రూ.5 వేలు అవతుందన్నారు. 

బండి సంజయ్ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చెప్పులు మోయడం తప్ప చేసిన అభివృద్ధి ఏమి లేదన్నారు. రాముడి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్న బీజేపీని ప్రజలు ఓడించాలన్నారు. తెలంగాణలో ప్రధాని మోదీ కాలేజీలు కట్టారా? ఆసుపత్రులు నిర్మించారా? రైతుబంధు, దళితబంధు అమలు చేశారా? ఏ పని చేయకుండా తెలంగాణ ప్రజలను ఎలా ఓట్లడుగుతారని మండిపడ్డారు. బీజేపీ ఆవిర్భవించి మహా అయితే 40 సంవత్సరాలు అయిందని, కానీ దేవుళ్లు లక్షల సంవత్సరాల నుంచి ఉన్నారని, దేవుళ్లని ప్రజలంతా పూజిస్తూనే ఉన్నారన్నారు.

గుడికట్టి బీజేపీ ఓట్లడగడం సిగ్గుచేటన్నారు. ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ గొప్పగా పాలిస్తుందని ప్రజలు కోరకుంటే, అది కాస్తా అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. హైదరాబాద్ నుంచి గ్రామాలకు వచ్చే నేతలతో ప్రజలకు ఏమీ ఒరగదని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. చెన్నూరు ఎమ్మెల్యేగా గడ్డం వివేక్ గెలిచిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు.

బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తన కుమారుడు వంశీకృష్ణకు పార్టీ టికెట్ ఇప్పించుకునే పనిలో ఉండి ప్రజలను పట్టించుకోలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మొదలు పెట్టిన అభివృద్ధి పనులన్నింటినీ ఇప్పుడు ఎమ్మెల్యే నిలిపివేశారని నిప్పులు చెరిగారు. ప్రజల సమస్యలు పట్టించుకునేటోల్లు లేక నియోజకవర్గం అనాథ అయిందన్నారు. సభ, రోడ్ షోల్లో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, ముఖ్యనేతలు బండ శ్రీనివాస్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ గందె రాధిక, కొలిపాక శ్రీనివాస్ పాల్గొన్నారు.