23 April, 2026 | 10:34 PM

డీకే అరుణ విజయాన్ని కాంక్షిస్తూ ప్రధాని లేఖ

12-05-2024 12:32 AM

డీకే అరుణ విజయంపై మోదీ ధీమా

పార్లమెంటులో అడుగు పెట్టాలని ఆకాంక్ష 

హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): లోక్ సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ ఎంపీగా ప్రజలు డీకే అరుణను గెలిపించాలని, ఆమె విజయాన్ని కాంక్షిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఆమెకు లేఖ రాశారు. మహబూబ్‌నగర్ ప్రజలు తమ ప్రతినిధిగా డీకే అరుణను ఆశీర్వదిస్తారని నమ్ముతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదంతో డీకే అరుణ పార్లమెట్‌లో అడుగు పెడతారనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ ఎన్నికల్లో ఆమె విజయానికి తన ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ దశాబ్దాల పరిపాల న మిగిల్చిన అనేక సమస్యల నుంచి దేశానికి విముక్తి కల్పించినట్లు ప్రధాని లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు దేశ పౌరుల ఆకాంక్షలను నెరవేర్చడంపై, 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని లేఖలో వివరించారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ, ఎన్‌డీఏ కూటమిని దేశంలోని అన్ని వర్గాలు తిరస్కరించాయని ఆయన గుర్తు చేశారు.

దశాబ్దాల కాంగ్రెస్ పాలన, విదేశి విధానాలతో దేశం వెనుకబడి పోయిందని, దేశాన్ని ముందుకు నడిపించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ వర్గాలు కూడా నిర్లక్ష్యానికి, అవమానాలకు, అన్యాయానికి గురయ్యాయని ఆయన ఆరోపించారు. ఈ వర్గాల నుంచి అత్యధికంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు బీజేపీలోనే ఉన్నారని గుర్తు చేశారు. లోక్ సభ ఎన్నికలు మన దేశ భవిష్యత్తుకు చాలా ముఖ్యమైనవని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ప్రజలు ఓటు వేసేలా బీజేపీ కార్యకర్తలు సహకరించాలని కోరారు. పార్టీ కార్యకర్తల ఆరోగ్యం, శ్రేయోభిలాషుల ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని డీకే అరుణకు సూచించారు.