23 July, 2026 | 2:54 AM

కాంగ్రెస్ కన్నెర్ర

23-07-2026 02:21 AM
  1. ఢిల్లీలో రాహుల్‌పై దాడికి నిరసనగా పార్టీ శ్రేణుల ఆందోళన
  2. హైదరాబాద్‌లోని లోక్‌భవన్ ముట్టడికి ప్రయత్నం 
  3. పీసీసీ చీఫ్, మంత్రులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  4. గాంధీభవన్ ముట్టడికి ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ యత్నం
  5. బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ
  6. రాళ్లు, కర్రలతో పరస్పర దాడులు
  7. మహిళా కానిస్టేబుల్, జర్నలిస్టులకు గాయాలు 
  8. పోలీసులతో రాజ్యాంగాన్నినడుపుతామంటే కుదరదు 
  9. పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి) : కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ బుధవారం కాంగ్రెస్ చేపట్టిన ‘చలో లోక్‌భవన్’ కార్యక్రమం హైదరాబాద్‌లో ఉద్రిక్తతకు దారితీసింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ ఆధ్యర్యంలో లోక్‌భవన్ ముట్టడికి బయలుదేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్‌భవన్ వరకు కాంగ్రెస్ నేతలు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అజారుద్దీన్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో పాటు వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. లోక్‌భవన్ సమీపానికి చేరుకున్న ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.

ముందస్తుగా మూడంచెల భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు.. నాయకులను ముందుకు వెళ్లకుండా నిలువరించారు. కొందరు కార్యకర్తలు పోలీసుల నిర్బంధాన్ని అధిగమించేందుకు ప్రయత్నించడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని లోక్‌భవన్ పరిసరాలను పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అదనపు బలగాలతో పాటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి సిబ్బంది, మహిళా కానిస్టేబుళ్లను రప్పించి భద్రతను కట్టుదిట్టం చేశారు.

పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌తో పాటు మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతలు తమ చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపారు. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇతర నాయకులను పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించి, కొద్దిసేపటి తర్వాత విడుదల చేశారు.

బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం

గాంధీభవన్ ముట్టడిని నిరసిస్తూ పోటీగా బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు యత్నించాయి. ప్రభుత్వ విప్,  ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నంచడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు పరస్పరం ఒకరిపైకి ఒకరు కర్రలు,  రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడిలో ఓ మహిళా కానిస్టేబుల్, జర్నలిస్టుకు గాయాలయ్యాయి.

వారిని హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల ముట్టడులతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.  కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందతున్న జర్నలిస్టును ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, పీసీసీ ఫిషర్మెన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయికుమార్, పీసీసీ అధికార ప్రతినిధులు చనగాని దయాకర్, దర్‌పల్లి రాజశేఖర్‌రెడ్డి తదితరులు పరామర్శించారు. ప్రవీణ్‌కు, ఆయన కుటుంబానికి అండగా ఉంటామన్నారు.

ఏపీలో తన్నుకున్న బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు

విజయవాడలో బీజేపీ ఆందోళన ఉద్రిక్తతం 

అమరావతి, జూలై 22: కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీని అరెస్టు చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనలకు వ్యతిరేకం గా విజయవాడలో బుధవారం బీజేపీ ఆందోళన ఘర్షణకు దారితీసింది. రెండు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు బీజేపీ నాయకులు ఊరేగింపుగా చేరుకున్నారు. అక్కడ రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ నాయకులు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో చేతుల్లో ఉన్న పార్టీ జెండా కర్రలు, వాటర్ బాటిళ్లతో దాడులు చేసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ జంతర్‌మంతర్ నిరసనలకు కాంగ్రెస్సే అసలైన సూత్రదారని విమర్శించారు. ఢిల్లీ నిరసనలో అర్బన్ నక్సల్స్, 370 రద్దును వ్యతిరేకించే శక్తులున్నాయని ఆరోపించారు. 

ప్రజాస్వామ్యానికి విఘాతం : మహేష్‌కుమార్‌గౌడ్

రాహుల్‌గాంధీపై దాడి హేయమని, ప్రియాంకగాంధీని మహిళ అని కూడా చూడకుండా పోలీసులు వ్యవహరించారని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా బీజేపీ పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తుందని విమర్శించారు. నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం విఫలమైందని, బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడేందుకు పోరాటం కొనసాగిస్తామని, పోలీసులతో రాజ్యాంగాన్ని నడపాలని చూస్తే దేశంలో అది సాధ్యం కాదని హెచ్చరించారు.

ఇదిలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు చేపట్టాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. హన్మకొండలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో, ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సంగారెడ్డిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి.