మామునూరు ఎయిర్‌పోర్ట్‌టేకాఫ్
నేటి నుంచే టెండర్లు
- 1.8 కి.మీ రన్‌వేను 3.9 కి.మీకు విస్తరణ
- పెద్ద విమానాలు, కార్గో సేవలకు అనువుగా అభివృద్ధి
- కాకతీయ వైభవాన్ని ప్రతిబింబించేలా టెర్మినల్
- 2028 జూన్ 2 నాటికి ప్రారంభమే లక్ష్యం
(బండి సంపత్‌కుమార్) :
మహబూబాబాద్, జులై 22 (విజయక్రాంతి): నాలుగు దశాబ్దాలుగా మూతపడి ఉన్న వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయం మళ్లీ విమానాల రాకపోకలకు సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పౌర విమానయాన శాఖ సమన్వయంతో చేపట్టిన పునరుద్ధరణ పనులకు బుధవారం నుంచి టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. రూ.496.86 కోట్ల వ్య యంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో రన్‌వే వి స్తరణ, కొత్త ఏప్రాన్, ట్యాక్సీవే, ఆధునిక టెర్మినల్ నిర్మించనున్నారు.
2028 జూన్ 2 నాటికి విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంగా అధికారులు ముందుకు సాగుతున్నారు. 1930లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిర్మించిన మామునూరు ఎయిర్‌పోర్ట్ 1981 తర్వాత పూర్తిగా కార్యకలాపాలు నిలిపేసింది. 1987లో కొంతకాలం వాయుదూత్ చిన్న విమానాల సేవలతో పునఃప్రారంభమైనప్పటికీ ప్రయాణికుల ఆదరణ లేక మూతపడింది.
ప్రస్తుతం హైదరాబాద్ తర్వాత రాష్ర్టంలో రెండో అతిపెద్ద నగరంగా వ రంగల్ విస్తరిస్తున్న నేపథ్యంలో, రవాణా సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాల అభివృద్ధికి ఊతమివ్వాలన్నది సర్కార్ లక్ష్యం. ఇందుకోసం మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను ఆధుని క ప్రమాణాలతో పునరుద్ధరించాలని నిర్ణయించింది.
తొలగిన అడ్డంకులు
శంషాబాద్ విమానాశ్రయం 150 కిలోమీటర్ల ఎక్స్‌క్లూజివిటీ నిబంధనతో పాటు ఇతర పరిపాలనా అడ్డంకులు తొలగిపోవడంతో ఎట్టకేలకు మామూనూరు ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణకు మార్గం సుగమమైంది. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో సమన్వయం చేస్తూ విమానాశ్రయం పునఃప్రారంభానికి అవసరమైన పరిపాలనా, సాంకేతిక ప్రక్రియలను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది.
విమానాశ్రయ అభివృద్ధికి అవసరమైన భూసేకరణను కూడా ప్రభుత్వం ప్రాధాన్యతగా చేపట్టింది. నిజాం కాలం నుంచి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉన్న 697 ఎకరా ల భూమికి అదనంగా రూ.295 కోట్ల వ్యయం తో మరో 253 ఎకరాలను సమకూర్చింది. భూసేకరణ పూర్తవడంతో ప్రస్తుతం 1.8 కిలోమీటర్ల పొడవున్న రన్‌వేను 3.9 కిలోమీటర్ల వరకు విస్తరించేందుకు మార్గం సుగమమైంది.
రూ.496 కోట్లు మంజూరు
ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుని కేంద్ర ప్రభుత్వం, పౌర విమానయాన శాఖ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)కు పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో 2025 ఫిబ్రవరిలో ఆమోదం తెలిపింది. అనంతరం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఎయిర్‌పోర్ట్‌ను పలుమార్లు సందర్శించి అన్ని విధాలా అనువైందని నిర్ధారించారు. దీంతో ఈ ఏడాది జూన్‌లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి రూ.496.86 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ. 203.49 కోట్లు బేస్ వ్యయంతో రన్‌వే, ఏప్రాన్ తదితర నిర్మాణాల కోసం ఏఏఐ ఇటీవల టెండర్లను ఆహ్వానించింది.
కొత్త ప్రాజెక్ట్ ఇలా..
949 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ ఎయిర్‌పోర్‌టలో ఎయిర్ బస్ ఏ 320 వంటి పెద్ద విమానాలు, కార్గో సర్వీసులు తిరిగేలా రన్ వేలు అభివృద్ధి చేయన్నారు. రన్‌వే పునర్నిర్మాణం, కొత్త ఏప్రాన్, ట్యాక్సీ వే వంటి కీలక పనులకు గురువారం నుంచి టెండర్ల ప్రక్రియ మొదలుకానుంది. జూలై 23న ప్రీ-బిడ్ సమావేశం నిర్వహిస్తారు. బిడ్‌ల సమర్పణ, టెక్నికల్ బిట్స్ ఓపెనింగ్, ఫైనాన్షియల్ బిట్స్ ఓపెనింగ్ తదితర అంశాలను పూర్తి చేయడానికి సెప్టెంబర్ 7 వరకు గడువు విధించారు. టెండర్లు పూర్తికాగానే ఎయిర్‌పోర్ట్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
దేశ నలుమూలలకు విమాన సర్వీసులు
ఉడాన్ పథకం వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌లో అమలు చేస్తే దేశంలోని 58 ప్రాంతాలకు, తక్కువ చార్జితో వరంగల్ నుంచి విమానయాన సౌకర్యం అందుబాటులోకి వ స్తుంది. వరంగల్ మరింత అభివృద్ధి చెందడంతో పాటు ఇప్పటికే ఇక్కడ ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, ఐటీ కారిడా ర్ మరింత బలోపేతం కానున్నాయి. అలాగే ప్రపంచ వారసత్వ కట్టడాలైన రామప్ప, వరంగల్ కోట, ఇతర చారిత్రక, పర్యాటక ప్రదేశాలను పర్యాటకులు సందర్శించడానికి విమాన మార్గం అనుకూలంగా మారుతుంది.






