14 August, 2026 | 8:33 PM

ఖర్గేకు సంఘీభావంగా ఆలేరులో కాంగ్రెస్ భారీ పాదయాత్ర, సత్యాగ్రహం

14-08-2026 08:01 PM

దళితులను అవమానించడం తగదు: ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

ఆలేరు,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను దళితుడనే కారణంతో బీజేపీ నాయకులు అవమానించే విధంగా పసుపు నీళ్లు చల్లుకోవడం దళిత సమాజాన్ని అవమానించడమేనని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఈ ఘటనకు నిరసనగా ఆలేరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ధర్నా, సత్యాగ్రహ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలేరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాల వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ పాదయాత్ర నిర్వహించారు.

అనంతరం హల్ద్వానీ ఘటనకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సంఘీభావంగా సత్యాగ్రహం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, దళితులను కించపరిచేలా వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. దేశ రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనగామ ఉపేందర్ రెడ్డి, భువనగిరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేశ్వర్లు, అయినాల చైతన్య, నీలం పద్మ, గంధమల అశోక్, ఎంఏ ఎజాజ్, కట్టే బొమ్మల సాగర్ రెడ్డి ఆలేరు నియోజకవర్గం లోని వివిధ అమల సర్పంచులు కౌన్సిలర్లు చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఖర్గేకు సంఘీభావం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు, బీజేపీ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.