29 July, 2026 | 11:56 AM

కాంగ్రెస్ ఆకర్ష్

25-06-2024 02:17 AM
  • బీఆర్‌ఎస్ ఎల్పీపై కాంగ్రెస్ గురి

ఇప్పటికే హస్తం గూటికి ఐదుగురు ఎమ్మెల్యేలు 

త్వరలో మరో ఇద్దరు

వలస బాటలో ఒక మాజీ మంత్రి

అధిష్ఠానం అనుమతితోనే కండువాలు కప్పుతున్న సీఎం 

హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను లాక్కోవటమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కట్టుదిట్టమైన ఆపరేషన్ చేపట్టినట్టు తెలుస్తున్నది. గతంలో ఏకంగా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీనే నాటి సీఎం కేసీఆర్ తన పార్టీలో విలీనం చేసుకొన్నారు. ఇప్పుడు టైం కాంగ్రెస్‌కు వచ్చింది. నాడు కేసీఆర్ చేసినట్టుగానే ఇప్పుడు కాంగ్రెస్ ఆపరేషన్ మొదలుపెట్టింది. మొత్తం బీఆర్‌ఎస్ శాసనసభా పక్షాన్నే కాంగ్రెస్‌లో విలీనం చేసుకొనే దిశగా పక్కాగా అడుగులు వేస్తున్నది. అసెంబ్లీ సమావేశాల కంటే ముందే బీఆర్‌ఎస్‌ఎల్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసే దిశగా సీఎం కార్యాచరణను సిద్ధం చేసినట్టు తెలిసింది.

లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం, అవినీతి అరోపణలతో సతమతమవుతున్న బీఆర్‌ఎస్‌కు భవిష్యత్‌లో ఉనికి లేకుండా చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అందుకు కాంగ్రెస్ అధిష్ఠానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకునేవరకు సమాచారం బయటికి రాకుండా గోప్యంగా పని కానిచ్చేస్తున్నారు. ఇప్పటివరకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి (స్టేషన్‌ఘన్‌పూర్), దానం నాగేందర్ (ఖైరతాబాద్), తెల్లం వెంకట్రావ్ (భద్రాచలం), పోచారం శ్రీనివాస్‌రెడ్డి (బాన్సువాడ), సంజయ్‌కుమార్ (జగిత్యాల) హస్తం గూటికి చేరారు.

త్వరలోనే ఉత్తర తెలంగాణలో కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉంటున్న  మరో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక మాజీ మంత్రి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతున్నది. పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్‌లో చేరడానికి సంప్రదింపులు పూర్తయినట్లు చెప్తున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు మరో ఐదారుగురు తప్ప.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 

25 మంది ఎమ్మెల్యేలు టార్గెట్

ఈ ఆపరేషన్ ఆకర్ష్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఒక సీనియర్ నాయకుడు నేతృత్వం వహిస్తున్నట్టు తెలిసింది. బీఆర్‌ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న వారితో ఆయన ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. బీఆర్‌ఎస్‌కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి చేర్చుకుని, ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఇప్పటికే ఐదుగురు చేరగా, మరో 20 మందిని చేర్చుకునే దిశగా పావులు కదుపుతున్నారు.

కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పార్టీకి నమ్మకంగా ఉన్న మరో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై రాజకీయ వర్గాల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది. గతంలో కాంగ్రెస్, టీడీపీఎల్పీలను కేసీఆర్ ఎలా విలీనం చేశారో.. ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు కూడా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనే పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నది.

అనర్హత వేటుకు అవకాశం ఇవ్వకుండా..  

హస్తం గూటికి చేరిన ఎమ్మెల్యేలకు పార్టీ ఫిరాయింపుల చట్టం అమలు కాకుండా కాంగ్రెస్ నాయకత్వం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్ చేర్చుకున్నప్పుడు కేసీఆర్ అనుసరించిన విధానాలనే ఇప్పుడు అనుసరించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున 19 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అప్పుడు అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్‌కు చెందిన ఒక్కో ఎమ్మెల్యేను ఒక్కోసారి బీఆర్‌ఎస్‌లో చేర్చుకుని గులాబీ కండువా కప్పింది. నాడు బీఆర్‌ఎస్‌లో చేని ప్రతి కాంగ్రెస్ ఎమ్మెల్యే ‘నియోజకవర్గం అభివృద్ధి కోసమే’ అనే మాట చెప్పారు. ‘తెలంగాణ పునర్నిర్మాణం కోసం’ అని బీఆర్‌ఎస్ నాయకులు చెప్పేవారు. ఇప్పుడు అదే పద్ధతిని కాంగ్రెస్ పార్టీ రిపీట్ చేయాలని భావిస్తోంది.