29 July, 2026 | 12:45 PM

కారు వికర్ష్!

25-06-2024 02:01 AM
  • హస్తం వ్యూహాలకు గులాబీబాస్ విలవిల

పార్టీ వీడిన వారిపై అనర్హత వేటుకు సుప్రీంకు!

పార్టీకి దూరంకానున్న ఒకే సామాజిక వర్గపు ఎమ్మెల్యేలు?

హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి) :  రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ఉనికి కాపాడేందుకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. రోజుకో ఎమ్మెల్యే పార్టీ మారుతాడని ప్రచారం జరగడంతో కార్యకర్తలు నిరుత్సాహానికి గురైతున్నారు. దీంతో పార్టీని రక్షించుకునేందుకు  సీనియర్లతో మంతనాలు జరుపుతున్నారు. ముందుగా పార్టీ వీడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మౌనంగా ఉంటే అసలకే ఎసరు వస్తుందని భయపడుతూ  ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో  చేరి మూడు నెలలు కావొస్తున్న స్పీకర్ నిర్ణయం తీసుకోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు న్యాయ నిపుణులతో  చర్చించారు. ఈనెల  27న హైకోర్టులో దానం నాగేందర్ అనర్హత అంశంపై విచారణ ఉంది. వెంటనే న్యాయం ప్రకారం నిర్ణయం తీసుకొని నాగేందర్‌పైన అనర్హత వేటు వేయకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లేలా బీఆర్‌ఎస్  నిర్ణయం తీసుకుంది. దానం నాగేందర్‌తో పాటు ఇటీవల పార్టీ మారిన  ఎమ్మెల్యేలపైన ఒకేసారి సుప్రీం కోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. 

ఆ ఐదుగురు ఎమ్మెల్యేలపై వేటు?

బీఆర్‌ఎస్‌ను వీడిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం  వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌పై అనర్హత వేటు వేసేందుకు తగిన వ్యుహాలు రచిస్తున్నారు. దానం నాగేందర్‌పై అప్పట్లో స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తే స్పదించకపోవడంతో హైకోర్టు మెట్లు ఎక్కారు. తరువాత నలుగురు ఎమ్మెల్యేలు వరుసగా పార్టీని వీడటంతో అందరిపై సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు తెలుస్తోంది. 

అరడజన్ మంది ఒకే సామాజిక వర్గం!

నియోజకవర్గ అభివృద్ధి పేరుతో మరో అర డజన్ మంది ఎమ్మెల్యేలు గులాబీ వీడేందుకు సిద్ధమైనట్లు పార్టీలో చర్చ సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో  39 మంది ఎమ్మెల్యేలు గెలవగా ఇప్పటివరకు ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ సిట్టింగ్ సీటు కాస్త కాంగ్రెస్ ఖాతాలో పడింది.

ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కు 33 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరికొందరు హస్తం గూటికి చేరేందుకు మంతనాలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, గద్వాల్  నర్సాపూర్  లక్ష్మారెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ఖరారైనట్లు తెలుస్తోంది.

వేచిచూసే ధోరణిలో కేసీఆర్ 

ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారు. మరికొందరు కూడా వెళ్తనున్నారనే సమాచారంతో కేసీఆర్ అందుబాటులో ఉన్నవారిని తన ఫాంహౌస్‌కు ఆహ్వానించి, సమావేశమయ్యారు. ఇప్పటికిప్పడు పార్టీ మారవద్దని వారికి సూచించినట్లు తెలుస్తోంది. రెండు నెలలు వేచి చూడాలని, తరువాత రాజకీయ పరిస్థితులు మారుతాయని, ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని, అప్పుడు మనం పుంజుకునే అవకాశం ఉంటుందని వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఆరు నెలల్లో ఏం కానిది.. ఈ రెండు నెలల్లో ఏం మార్పులు ఏం జరుగుతాయనే ఆలోచనల్లో ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌లో చేరుతారా..?

మరోపక్క ఆ పార్టీ నేతల్లో కేసీఆర్ తీసుకునే నిర్ణయంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన కుటుంబంపై కక్ష  సాధిస్తున్నదంటున్న బీజేపీని దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్‌తో చేతులు కలిపే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ఒంటరిగా ఉంటే రాజకీయ మనుగడ కోల్పోయే అవకాశం ఉందని, పార్టీని మరో ఐదేళ్లు నడపటం భారంగా మారుతుందనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో హస్తంలో చేరితో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంశాలు కూడా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.

దీనికి తోడు ప్రస్తుతం పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్నప్పుడు ధరణి ద్వారా వందల ఎకరాల ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుని రియల్ వెంచర్లు చేసి కోట్లు కూడబెట్టుకున్నారు. వీరిని కాపాడేందుకు కాంగ్రెస్‌లో చేరితే ఏ సమస్య ఉండదని భావిస్తున్నట్లు తెలిసింది. మరో వైపు కేసీఆర్‌ను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ నమ్మదని, తెలంగాణ ఏర్పాటు చేస్తే ఆపార్టీలో విలీనం చేస్తానని మాట తప్పడంతో ఆయనను ఎట్టి పరిస్థితిల్లో చేర్చుకోదనే వాదనలు కూడా ఉన్నాయి. 

కమలం వైపూ మొగ్గు!  

తన రాజకీయ ఉనికిని నిలబెట్టుకునేందుకు, గతంలో చేసిన అక్రమాల నుంచి బయటపడేందుకు బీజేపీలో కూడా చేరవచ్చనే ప్రచారం వినిపిస్తోంది. తన కూతురు ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో తీహార్ జైల్లో ఉండటంతో ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు కమలం పార్టీ పంచన చేరుతారని, దీనికి తోడు రేవంత్ సర్కార్ గత బీఆర్‌ఎస్  పాలనలో జరిగిన కుంభకోణాలు వెలికితీస్తుండటంతో వీటి నుంచి సేఫ్‌గా ఉండేందుకు మోడీకి జైకొడతారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ అక్కడ కూడా  కేసీఆర్‌ను నమ్మే ప్రసక్తి లేదని, గతంలో నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్‌పై కేసు నమోదు  చేయడంతో అప్పటి నుంచి  కమలనాథులు కక్ష పెంచుకున్నారు. ఇప్పడు పార్టీకి వస్తే ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోరని బీఆర్‌ఎస్ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ఆర్థికబలం, అంగబలం ఉండేలా

ఐదేళ్ల పాటు పార్టీని నడపడం చాలా కష్టమైనదని, సభలు, సమావేశాలు నిర్వహించా లంటే ఆర్థిక వనరులు సరిపడ ఉండాలని, అవి లేకుంటే పార్టీ ముందుకు వెళ్లదు. కార్యకర్తలు కూడా పార్టీ బలహీనమైతుండటంతో పక్క పార్టీ జెండా కప్పుకోక తప్పదు. ఇలాంటి పరిస్థితిని ఏవిధంగా ఎదుర్కోవడమనేది కేసీఆర్‌కు కత్తిమీద సాములా మారింది.  

రేవంత్ సర్కార్‌పై ప్రజా వ్యతిరేకతే ఆఖరి ఆయుధం 

ఎమ్మెల్యేలు, సీనియర్లంతా పార్టీ వీడితే మిగిలేది ద్వితీయ శ్రేణి నాయకత్వం మాత్రమే. వారితో పాటు పార్టీని, కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు కాంగ్రెస్‌కు రానున్న రోజుల్లో ఏర్పడే ప్రజా వ్యతిరేకత మాత్రమే కేసీఆర్ ముందు ఉన్న ఒకే ఒక అస్త్రం. దానిని ఆయుధంగా చేసుకుని ప్రజల వద్దకు వెళ్లి గత పాలన, ప్రస్తుత పాలనపై వివరించి అధికారం చేపట్టేందుకు కనిపించే దారి ఒక్కటే.