29 July, 2026 | 10:59 AM

మూడు నెలల్లో నైనీ బొగ్గు!

25-06-2024 02:23 AM
  • అక్కడే 1600 మెగావాట్ల థర్మల్ ప్లాంటు!
  • ఒడిశా సీఎస్‌తో సింగరేణి సీఎండీ చర్చలు  

హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): సింగరేణి చేపట్టిన వ్యాపార విస్తరణలో మరో అడుగు ముందుకు పడింది. ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌లో వీలైనంత తొందరగా బొగ్గు ఉత్పత్తితోపాటు.. 1600 మెగావాట్ల (2x800 మెగావాట్లు) థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌కుమార్ జెనాతో సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నైనీ బొగ్గు గని నుంచి ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం చివరి (సెప్టెంబర్) నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ బొగ్గు ఉత్పత్తి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవటంతోపాటు, నైనీ సమీపంలో సింగరేణి నిర్మించతలపెట్టిన థర్మల్ ప్లాంటు ఏర్పాటుకు అనువైన స్థలం కేటాయించాలని బలరాం కోరారు.

నైనీ బ్లాక్‌కు ఇప్పటికే అన్ని రకాల అనుమతులు లభించాయని, రెండో దశ అనుమతుల్లో పొందుపర్చిన నిబంధనల ప్రకారం సింగరేణి చర్యలు తీసుకుందని వివరించారు. ఒడిశా ప్రభుత్వం కోరినట్టుగా వన్యప్రాణి నిర్వహణ కోసం రూ.39 కోట్లు డిపాజిట్ చేశామని, మొత్తంగా ఇప్పటివరకు ప్రభుత్వానికి రూ.180 కోట్లు చెలించినట్టు తెలిపారు. ప్రాజెక్టుకు కావాల్సిన 783 హెక్టార్ల అటవీ భూమిని సింగరేణికి బదలాయించాలని కోరారు. నైనీ ప్రాజెక్టు నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ప్రదీప్‌కుమార్ జెనా హామీ ఇచ్చారు. అటవీ భూమిని సింగరేణికి అప్పగించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేస్తామని తెలిపారు.

1600 మెగావాట్ల థర్మల్ ప్లాంటు నిర్మాణం

నైనీ బొగ్గు గనికి 50 కిలోమీటర్ల దూరంలోనే 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు ప్లాంట్‌ను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఒడిశా రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఒడిశా ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఇడ్కో) చైర్మన్ హేమంత్‌శర్మను కలిసిన సింగరేణి సీఎండీ బలరామ్ వివరించారు. ఈ థర్మల్ ప్లాంట్ ఏర్పాటుకోసం ఇప్పటికే సింగరేణి ఉన్నతాధికారుల బృందం ఒడిశాలో పర్యటించి నాలుగు ప్రదేశాలను పరిశీలించిందని తెలిపారు. ఇందుకు సుమారు 800 ఎకరాల స్థలం అవసరమని, సంబంధిత భూ సేకరణకు ప్రభుత్వం నుంచి సహకారాన్ని కోరారు. దీనిపై స్పందించిన హేమంత్‌శర్మ.. ఇడ్కో సీజీఎం (ల్యాండ్) సరోజ్‌కుమార్ సేథీతో మాట్లాడి వెంటనే ఆయా పనులకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఒడిశా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ సుశాంత్ నందాను సీఎండీ బలరామ్ కలిశారు. నైనీకి సంబంధించిన అటవీ భూముల బదలాయింపుపై విన్నవించగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా సీఎండీ బలరామ్ మాట్లాడుతూ.. భూమి బదలాయింపు జరిగితే మూడు నెలల్లో బొగ్గు ఉత్పత్తి మొదలవుతుందని పేర్కొన్నారు. ఒడిశాలో థర్మల్ ప్లాంటును ఏర్పాటుచేస్తే.. సింగరేణికి ఆర్థికంగా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఒడిశా ఉన్నతాధికారులతో భేటీలో సీఎండీ వెంట నైనీ జీఎం తుమ్మలపల్లి శ్రీనివాసరావు, జీఎం (ఎస్టేట్స్) బండి వెంకటయ్య, చీఫ్ ఆఫ్ పవర్ ప్రాజెక్ట్స్ విశ్వనాథరాజు, ప్రాజెక్టు ఆఫీసర్ ఎస్ ముజుందార్, ఎస్‌ఈ (మైనింగ్) ప్రవీణ్ కశ్యప్ తదితరులు ఉన్నారు.