ఢిల్లీకి బయలుదేరిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
26-06-2024 02:32 PM
హైదారాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఢిల్లీకి పయనం అయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ నుండి ఢిల్లీ బయలు దేరారు. జీవన్ రెడ్డితో పాటు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉన్నారు. తనకు తెలియకుండా తన రాజకీయ ప్రత్యర్థి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడంపై జీవన్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. దాదాపు 40 ఏళ్లుగా పార్టీలో పనిచేసి అవమానంగా భావించి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. వెంటనే ఢిల్లీ రావాల్సిందిగా జీవన్ రెడ్డికి ఏఐసీసీ నుండి పిలుపు వచ్చింది. జీవన్ రెడ్డిని ఢిల్లీకి తీసుకురావాల్సిందిగా విప్ అడ్లూరి లక్ష్మణ్ ని కాంగ్రెస్ పెద్దలు ఆదేశించారు. దీంతో ఇరువురు నేతలు ఢిల్లీకి వెళ్లారు.






