27 July, 2026 | 1:22 AM

కల్వకుర్తి కారు రేసులో ‘గోలి’!

27-07-2026 12:50 AM
  1. మాజీ ఎమ్మెల్యే జైపాల్, ఉప్పల వెంకటేష్ మధ్య ‘తూటాల’ దూకుడు
  2. డిలిమిటేషన్ జరిగితే అవకాశం కోసం కొత్త నేతల కన్ను.. 
  3. ఆమనగల్ కేంద్రంగా పొలిటికల్ స్కెచ్‌లు

కల్వకుర్తి కారు పార్టీలో టికెట్ పోరు ఇప్పుడే తారాస్థాయికి చేరింది. నియోజకవర్గ పునర్విభజన (డిలిమిటేషన్) ఊహాగానాలు, స్థానిక సమీకరణాల నేపథ్యంలో గులాబీ నేతల మధ్య అంతర్గత యుద్ధం ముదిరి పాకాన పడింది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, నేత ఉప్పల వెంకటేష్ల మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరును క్యాష్ చేసుకునేందుకు మరో సీనియర్ నేత గోలి శ్రీనివాస్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇద్దరు నేతల గొడవ మధ్యలో ’మూడో వ్యక్తి’కి లబ్ధి చేకూరేలా ఉందనే చర్చ నియోజకవర్గంలో జోరుగా చర్చ సాగుతోంది. అమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడుగుల, వెల్దండ మండలాల్లో మారుతున్న రాజకీయ సమీకరణాలపై ‘విజయక్రాంతి’ ప్రత్యేక విశ్లేషణ.

రంగారెడ్డి,జూలై 26 (విజయక్రాంతి): ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే కాకుం డా, రాష్ట్ర రాజకీయాల్లోనూ కల్వకుర్తి నియోజకవర్గానికి ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ ఉంది. స్వరాష్ట్రంలో ఈ ప్రాంతానికి చెందిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో, ఇక్క డ కాంగ్రెస్ను ఢీకొట్టి కారు గుర్తుపై గెలిస్తే రా ష్ట్రస్థాయిలో గుర్తింపుతో పాటు అధిష్ఠానం వద్ద తిరుగులేని పట్టు సాధించవచ్చనేది గు లాబీ నేతల అంచనా. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ సాధించేందుకు బీఆర్‌ఎస్ ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశా రు. నిత్యం ప్రజల్లో ఉంటూ సుడిగాలి పర్యటనలతో కేడర్ను ఆకట్టుకునే పనిలో పడ్డారు.

నాల్గవసారి గెలుపే లక్ష్యంగా జైపాల్ యాదవ్ వ్యూహాలు

నియోజకవర్గంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఉన్న మాజీ ఎమ్మెల్యే గుర్కా జైపాల్ యాదవ్.. ఈసారి నాలుగోసారి ఎలాగైనా విజయం సాధించాలనే ప ట్టుదలతో ఉన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోకి వస్తే సీనియారిటీ కోటాలో మంత్రి పదవి దక్కుతుందనే ధీమాతో ఆయ న ఉన్నారు. తనదైన శైలిలో కేడర్కు దిశానిర్దే శం చేస్తూ విస్తృతంగా పర్యటిస్తున్నారు.

కేడర్లో గందరగోళం..

మరోవైపు తలకొండపల్లి గ్రామానికి చెందిన ఉప్పల ట్రస్ట్ చైర్మన్, మాజీ జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ టికెట్ రేసులో దూకుడు ప్రదర్శిస్తున్నారు. గ్రామ  ఉపసర్పంచ్ స్థాయి నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన, గత ఎన్నికల సమయంలో పార్టీలో చేరి కొద్దిరోజుల పాటు మిషన్ భగీరథ చైర్మన్గా పనిచేశారు. ‘ఎమ్మెల్యే రేసులో నేనున్నానంటూ‘ సంకేతాలి స్తూ... ఉప్పల్ ట్రస్టు పేరుతో  గ్రామాల్లో వి స్తృత ప్రచారం చేస్తూ ప్రజల మద్దతు కూడగట్టేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.

అయితే ఆయన శైలి, నోటిదురుసు ప్రచారం మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వర్గానికి మింగుడుపడటం లేదనే చర్చ నడుస్తోంది. వీరిద్దరి మధ్య నడుస్తున్న ’కోల్ వార్’ ఏ క్ష ణంలోనైనా బహిర్గతం కావచ్చని పార్టీ శ్రే ణులు భావిస్తున్నాయి. ఎవరి పక్షాన నిలబడితే ఏ నేతకు కోపం వస్తుందోనని ద్వితీయ శ్రేణి నాయకులు ఆందోళన చెందుతున్నారు.

ఇద్దరి పోరు.. ‘గోలి’కి వరమవుతుందా?..

రెండు పిల్లులు ఒక రొట్టె ముక్క కోసం కొట్టుకుంటే... మధ్యలో కోతి వచ్చి రొట్టెను తిన్నట్టుగా... కల్వకుర్తి బీఆర్‌ఎస్లో ఉన్న వర్గపోరు అచ్చం ఇలాగే తయారైంది. బయటకు అందరూ తాము ఒక్కటే అని చెప్పుకుంటున్నా.. లోలోపల ఎవరి ఎత్తుగడలు వారివే.ఈ ఇద్దరు నేతల వివాదాల మధ్య, వెల్దండ మండలానికి చెందిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పేరు నియోజకవర్గంలో బలంగా వినిపిస్తోంది.

పదవి ఉన్నా లేకపోయినా సంవత్సరాలుగా ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, వివాదరహితుడిగా కార్యకర్తలకు తలలో నాలుకలా మారారనే పేరు ఆయనకుంది. ఒకవేళ ఏవైనా సమీకరణాల వల్ల తనకు అవకాశం దక్కకపోతే, ఉప్పల వెంకటేష్కు చెక్ పెట్టేందుకు జైపాల్ యాదవ్ సైతం గోలి శ్రీనివాస్ రెడ్డి వైపే మొగ్గు చూపే అవకాశం ఉందనే ప్రచారం గ్రామాల్లో జోరుగా సాగుతోంది. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న గోలి శ్రీనివాస్ రెడ్డికి ఈసారి కారు గుర్తు దక్కడం ఖాయమని ఆయన అభిమానులు అప్పుడే  నియోజకవర్గం లో ప్రచారం షురూ చేశారు.  

టికెట్ రేసులో మరికొందరు..

వీరితో పాటు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే దివంగత ఎడ్మ కిష్టారెడ్డి తనయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం సైతం టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) జరిగి, మహిళా కోటా సమీకరణాలు తెరపైకి వస్తే.. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ రజిని సాయిచంద్, వెల్దండ ప్రాంతానికి చెందిన విజితా రెడ్డిలు సైతం కారు గుర్తుపై పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. రజిని సాయిచంద్ ఇటీవల నియోజకవర్గ మున్సిపల్ ఎన్నికల, సర్ (ఓటర్ల సవరణ) ఇన్చార్జిగా  వ్యవహరిస్తూ స్థానికంగా పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఆమనగల్ నియోజకవర్గంపై ఎన్నారైల కన్ను...

ఒకవేళ రాబోయే రోజుల్లో డిలిమిటేషన్ ప్రక్రియ పూర్తయి, కొత్తగా ఆమనగల్ నియోజకవర్గం ఏర్పాటైతే.. అందులోకి కడ్తాల్, మాడుగుల, తలకొండపల్లి, కేశంపేట మండలం లోని కొన్ని గ్రామాలుఆమనగల్ కు వెళ్లే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఈ కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు స్థానిక నేతలతో పాటు పలువురు ఎన్నారైలు  సైతం ఇప్పటి నుంచే ఆమనగల్ వైపు కన్నేశారు. ఏదేమైనప్పటికీ, గ్రూపు రాజకీయాలతో వేడెక్కిన కల్వకుర్తి నియోజకవర్గంలో చివరికి ’కారు’ బాస్ ఆశీస్సులు ఎవరికి దక్కుతాయి? ఈ త్రిముఖ అంతర్గత పోరులో టికెట్ ఎవరిని వరిస్తుంది? అనేది అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు ప్రజల్లోనూ నిత్యం ఉత్కంఠ రేపుతోంది.