రాజ్యాంగమే మనకు రక్ష

10-05-2024 01:33:20 AM

రిజర్వేషన్లు రద్దు చేసేందుకే ప్రైవేటీకరణ

20 మంది బిలియనీర్ల కోసమే మోదీ తపన

మా ప్రభుత్వం రాగానే ప్రతి మహిళ అకౌంట్‌లో లక్ష

నిరుద్యోగ యువతకు ౩౦ లక్షల ఉద్యోగాలు

కులగణనతో పేదల జాబితా రూపొందిస్తాం

నర్సాపూర్, హైదరాబాద్ సభల్లో కాంగ్రెస్ నేత రాహుల్

మెదక్/రంగారెడ్డి, మే 9 (విజయక్రాంతి): దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను రద్దుచేసేందుకు బీజేపీ ప్రణాళికాబద్ధంగా కుట్ర చేస్తున్నదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. అందులో భాగం గానే ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరిస్తున్నారని విమర్శించారు. మొత్తం ప్రైవేటు రంగంగా మార్చి.. రిజర్వేషన్లు అందకుండా చేసే కుట్ర జరుగుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్ద తుగా నిర్వహించిన సభలో రాహుల్‌గాంధీ మాట్లాడారు.

అనంతరం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన సభలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యాంగానికి ముప్పు రానివ్వదని స్పష్టంచేశారు. దేశంలోని పేదలు, వెనుకబడిన వర్గాల ప్రజలం దరికీ రాజ్యాంగమే రక్ష అని పేర్కొన్నారు. రాజ్యాంగం భారతీయుల ఆత్మ అని, అది కేవలం పుస్తకం కాదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రక్షణకు ఆయుధమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నంతవరకు రాజ్యాంగాన్ని ఎవరూ టచ్ చేయలేరని తేల్చిచెప్పారు.

రాజ్యాంగ రక్షకులకు, భక్షకులకు యుద్ధం

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు రాజ్యాంగాన్ని రక్షించే సమూహానికి, రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్న వారికి మధ్య యుద్ధమని రాహుల్‌గాంధీ అన్నారు. ‘పేద, బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి అయిన రాజ్యాంగాన్ని రక్షించడమే ‘ఇండియా‘ కూటమి లక్ష్యం. మేము అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని పెంచుతాం. రాజ్యాంగాన్ని మారుస్తా మని, రిజర్వేషన్లు రద్దు చేస్తామని మోదీ చెప్తున్నారు.

రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. రాజ్యాంగం సామాన్యుల గొంతుక. రాజ్యాం రక్షణ ఇండియా కూటమితోనే సాధ్యం. పదేండ్లుగా 20 మంది ధనవంతులకు నరేంద్రమోదీ దేశంలోని పేదల సంపదంతా దోచిపెడుతున్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడమే కాకుండా అదానీ, అంబానీ కోసం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్నారు. గిరిజనులు, ఆదివాసీలు, ఎస్సీలు, ఎస్టీలు, కార్మికులు తమ హక్కులను కాపాడుకోవాలంటే రాజ్యాంగం రక్షించబడాలి’ అని ప్రకటించారు. 

కులగణన చేపడుతాం

దేశంలో 90 శాతం జనాభా బడుగు, బలహీనవర్గాలవారుండగా, రెండు శాతం ఉన్న ఇతర వర్గాల చేతిలో పాలన సాగుతున్నదని రాహుల్‌గాంధీ దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి బలహీన వర్గాలవారిని రాజకీయంగా, ఆర్థికంగా చైతన్యవంతులను చేస్తామని హామీ ఇచ్చారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ఈ చరిత్రాత్మక పనికి శ్రీకారం చుడుతామని చెప్పారు. 

ప్రతి మహిళకు రూ.లక్ష

దేశవ్యాప్తంగా పేదల జాబితాను తయారుచేసి ఆ కుటుంబం నుంచి ఒక మహిళను ఎంపికచేసి ఆమె బ్యాంకు ఖాతాలో రూ.లక్ష జమచేస్తామని రాహుల్‌గాంధీ ప్రకటించారు. పేద కుటుంబాలకు ప్రతినెలా రూ.8,500 అందిస్తామని, ఆ డబ్బును చదువు, వైద్యం కోసం ఖర్చు చేసుకోవచ్చని తెలిపారు. దేశంలో పేదరిక నిర్మూలనకు కాంగ్రెస్ పార్టీ బృహత్తర కార్యక్రమం చేపట్టబోతుందని చెప్పారు. పేదలందరినీ లక్షాధికారులను చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. 

ఆగస్టు 15లోపు 30 లక్షల ఉద్యోగాలు

ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆగస్టు 15 నాటికి దేశవ్యాప్తంగా 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. మోదీ ప్రభుత్వం యువకులను, నిరుద్యోగులను వంచించిందని, 30 లక్షల ఉద్యోగ ఖాళీలున్నా ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు. రైతుల రుణాలను మాఫీ చేయకుండా వారిని వేధింపులకు గురి చేశారని, తాము అధికారంలోకి రాగానే తక్షణమే రైతుల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తామని తెలిపారు. ఆశ, అంగన్‌వాడీల వేతనాలను రెట్టింపు చేస్తామని ప్రకటించారు. గత పదేండ్లలో దేశ సంపదను ధనవంతులకు మోదీ ఎంత అందించారో.. అంత సొమ్మును తమ ప్రభుత్వం పేదలకు పంచుతుందని చెప్పారు. 

సిపాయిలా పనిచేస్తా

దేశాన్ని, రాజ్యాంగాన్ని రక్షించేందుకు సిపాయిలా పనిచేస్తానని రాహుల్ తెలిపారు. తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి టీం అద్భుతంగా పనిచేస్తోందని ప్రశంసించారు. దేశంలో సంపదకు కొదవ లేదని, ఇన్నాళ్లు ఈ సంపద కొన్ని వర్గాలకే దక్కిందని అన్నారు. నోట్ల రద్దుతో దేశ ప్రజలంతా అరిగోస పడ్డారని, మోదీ ఆ పని అదానీ కోసమే చేశారని ఆరోపించారు. మోదీ తప్పుడు నిర్ణయాలతో నిరుద్యోగం పెంచారని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. 

హైదరాబాద్‌లో మత చిచ్చుకు కుట్ర

దేశంలో నిరుపేదల కోసం రాహుల్ గాంధీ తన జీవితాన్ని త్యాగం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 14 లోక్‌సభ స్థానాల్లో గెలిపించి ఇండియా కూటమికి అండగా నిలవాలని కోరారు. హైదరాబాద్‌లో మతసామరస్యాన్ని కాపాడింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో, హైదరాబాద్‌లో మత చిచ్చు పెట్టేందుకు కుట్ర చేస్తున్నదని ఆరోపించారు.

15 సెకన్లు సమయం ఇస్తే మైనార్టీలను తుదముట్టిస్తామని బీజేపీ ఎంపీ నవనీత్‌రాణా చేసిన ప్రకటనపై సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆమె ప్రకటన బీజేపీ నేతల స్వభావానికి అద్దంపడుతుందని విమర్శించారు. విశ్వనగరంలో బీజేపీ వాళ్లు విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. హిందుత్వం గురించి బీజేపీవాళ్లు మనకు నేర్పాలా? అని ప్రశ్నించారు. నవనీత్‌కౌర్‌ను వెంటనే బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని, ఆమెపై కేసు నమోదుచేయాలని డిమాండ్ చేశారు. 

కేసీఆర్‌కు ఇంకా బుద్ధి రాలేదు

బీఆర్‌ఎస్ నేత కేసీఆర్ బస్సు యాత్ర చూస్తుంటే ఇంకా అధికార దాహం కోసం ఆరాటపడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బండకేసి కొట్టినా ఆయనకు బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక ప్రజల చెవిలో పువ్వులు పెట్టిన రఘునందన్‌రావును పాతరేశారని, ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు.

రైతులను అరిగోస పెట్టిన మాజీ కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి వందల కోట్లు కేసీఆర్, హరీశ్‌రావుకు అప్పగించడం వల్లనే ఆయనకు టికెట్టు ఇచ్చారని ఆరోపించారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులు నష్టపరిహారం అడిగితే పోలీసులతో కొట్టించిన వెంకట్రామ్‌రెడ్డికి ఈ ఎన్నికల్లో కర్రకాల్చి వాతపెట్టాలని సూచించారు. బడుగుల ఆశాజ్యోతిగా నీలం మధును గెలిపిస్తే అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడతారని తెలిపారు. 

సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ్మ, కాంగ్రెస్ నేతలు సురేశ్, జగ్గారెడ్డి, వేదకుమార్, మైనంపల్లి రోహిత్‌రావు, హన్మంతరావు, ఆంజనేయులుగౌడ్, లోక్‌సభ అభ్యర్థులు నీలం మధు, పట్నం సునీతా మహేందర్‌రెడ్డి, గడ్డం రంజిత్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.