గరిమెళ్లపాడుకు కదిలిన యంత్రాంగం
ఓటువేసేందుకు ఓప్పించిన అధికారులు
భద్రాద్రి కొత్తగూడెం, మే9 (విజయక్రాంతి): సమస్యలు పరిష్కరించేవరకు ఓటేసీ లేదని ఫ్లెక్సీలు కట్టి నిరసన తెలిపిన గరిమెళ్లపాడు గ్రామస్థులపై ‘దేవుడి మీద ఒట్టు.. ఒటు వేయం’ శీర్షికతో విజయక్రాంతి దినపత్రికలో వచ్చిన కథనానికి భద్రాద్రి అధికార యంత్రాంగం స్పందించింది. గురువారం గరిమెళ్లపాడు గ్రామానికి వెళ్లి ప్రజలతో చర్చించింది. ఏళ్ల తరబడి సమస్యలను పరిష్కరించడం లేదని, ఉపాధి కల్పించడం లేదని గిరిజనులు అధికారుల ముందు గోడు వెళ్లబోసుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని బ్యానర్ కట్టామే తప్ప రాజ్యాంగాన్ని దిక్కరించాలనే ఉద్దేశం తమకు లేదని తెలిపారు. గరిమెళ్లపాడు నర్సరీలో ఉపాధి కల్పించాలని, ఐటీడీఏలో ఉన్న భూములు తమ తాతలు తండ్రుల నుంచి వచ్చినవని, భూమి లేకపోయినా కనీసం ఉపాధి కల్పించాలని గతంలో పీవో దివ్య, అప్పటి కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతుకు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదని వాపోయారు. ఐటీడీఏలో గిరిజ నులకు మాత్రమే టెండర్లు ఇవ్వాల్సి ఉండగా, గిరిజనేతరులకు ఇచ్చి గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. గిరిజనుల సమస్య లను సావదానంగా విన్న అధికారులు.. ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు. కొత్తగూడెం ఆర్డీవో డీ మధు, డీఎస్పీ రహమాన్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, ఎన్నికల అనంతరం సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి మార్గం చూపుతామని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ఓటేయడానికి అంగీకారం తెలిపారు. కార్యక్రమంలో కొత్తగూడెం తహసీల్దార్ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.






