వికసిత్ కాదు.. విఫల భారత్

10-05-2024 01:30:39 AM

అచ్చేదిన్ కాదు.. ఇచ్చేదిన్ రాలేదు

మోదీపై విరుచుకుపడ్డ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్

కరీంనగర్, మే 9 (విజయ క్రాంతి): కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ పదేళ్లలో భారతదేశం వికసిత్ భారత్ కాలేదు కానీ విఫల భారత్ అయిందని బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విరుచుకుప డ్డారు. గురువారం రాత్రి కరీంనగర్‌లో రోడ్‌షో నిర్వహించారు. తెలంగాణ చౌక్‌లో జరిగిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ, అచ్చేదిన్ అని చెప్పి ధరలు పెంచడం తప్ప ఇచ్చేదిన్ రాలేదని అన్నారు. 150 హామీలిచ్చిన మోదీ ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు.

నల్లధనం తెచ్చి పేదల బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షలు ఇస్తానని చెప్పి మోసం చేసింది మోదీ అని, బండి సంజయ్ తెచ్చి ఇచ్చాడా అని ప్రజలను ప్రశ్నించారు. పుల్వామా, పాకిస్థాన్‌ల పేర్లు చెప్పి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి పదేళ్లు పూర్తి చేసుకున్నారని అన్నారు. మేధావులు ఆలోచన చేయాలని, ఎమోషనల్ బ్లాక్ మెయిల్‌తో దేశం నాశనం అయిందని చెప్పారు. రూపాయి విలువ పతనమై దిగుమతులు తగ్గిపోయాయని అన్నారు. ఈ పదేళ్ల పాలనలో ఏ ఒక్క వర్గానికి కూడా మేలు జరగలేదని అన్నారు.

ఢిల్లీలో దీక్షలు జరిగితే ప్రాణాలు పొట్టన పెట్టుకున్న వ్యక్తి మోదీ అంటూ మండి పడ్డారు. ప్రజల మధ్య చీలికలు తెచ్చి కార్పొరేట్ సంస్థల కోసం కోట్ల రూపాయలు అప్పులు ఇస్తున్నారని, డబ్బాలో రాళ్లువేసి ఊపినట్లు తప్ప చేసిందేమి లేదన్నారు. కరీంనగర్ గడ్డ ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన గడ్డ అని, ఉప ఎన్నికల్లో తనను గుండెల్లో పెట్టుకుని రెండున్నర లక్షల మెజార్టీ అందించిన గడ్డ అని, ఉద్యమంలో మరిచిపోలేని పాత్ర కరీంనగర్‌దని అన్నారు.

చైతన్యవంతమైన కరీంనగర్ ప్రజలు ఆలోచించి విద్యావంతుడైన వినోద్‌కు మద్దతు తెలుపాలని పిలుపునిచ్చారు. తాను స్వయంగా మోదీని కలిసి అనేకమార్లు ప్రతి జిల్లాలో నవోదయ పాఠశాలలు ఇవ్వాలని కోరితే ఒక్కటి కూడా ఇవ్వలేదని, ఒక్క మెడికల్ కళాశాల కూడా ఇవ్వలేదని అన్నారు. ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరితే ఇవ్వకుండా నా మెడమీద కత్తిపెట్టి మోటర్లకు మీటర్లు పెట్టాలని షరతులు విధించారని, నువ్వు ఏమన్నా చేసుకో నేను మీటర్లు పెట్టనని చెప్పానని గుర్తు చేశారు.

2019లో తెలంగాణలో నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచి నాలుగు రూపాయల పని కూడా చేయలేదని అన్నారు. కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ  తెచ్చిందని వినోద్‌కుమార్ అని, 2 వేల కోట్లతో సుందరనగరంగా చేసింది గంగుల కమలాకర్ అని అన్నారు. బండి సంజయ్‌తో పైసా పని కాలేదని, ఆయనకు భాష రాదని, మాట్లాడితే అర్థంకాని పరిస్థితి అని, మేధావి అయిన వినోద్‌కుమార్‌ను పార్లమెంట్‌కు పంపాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి నోటికి వచ్చిన హామీలతో గద్దెనెక్కారని అన్నారు.

కళ్యాణలక్ష్మీ కింద లక్ష రూపాయలతోపాటు తులం బంగారం ఇస్తామన్నారు, ఎక్కడా ఇవ్వలేదని, ఆడబిడ్డలకు 2500 రూపాయలు ఇస్తా అన్నారు, వచ్చాయా, పొన్నం ప్రభాకర్ ఇచ్చాడా అంటూ మహిళలను ప్రశ్నించారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9కే ఇస్తామని రేవంత్ రెడ్డి మాట ఇచ్చాడని, ఇప్పటికీ రాలేదన్నారు. అనేకరకాలుగా మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు. 

ఫ్రీ బస్ ఒకటి ఇచ్చి సర్కస్‌లో లాగా కొట్లాటలు పెట్టించారని అన్నారు. కాళేశ్వరంలో ఏదో ఉందని చెప్పి రైతుల నోట్లో మట్టి కొట్టారని, ప్రజలు సాగునీరు, తాగునీటికి పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే నాకు బాధకరంగా ఉందన్నారు. ఐదెకరాల దాటిన వారికి రైతుబంధు ఇవ్వనని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, వాళ్లు ఏ పాపం చేశారని ప్రశ్నించారు. 420 హామీలిచ్చి అందరిని, అన్నివర్గాల ప్రజలను మోసం చేశారని తెలుపుతూ, తన సర్వే ప్రకారం వినోద్‌కుమార్ గెలుపు ఖాయమైందని, ముందు వరుసలో ఉన్నారని తెలిపారు.

ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర మేయర్ వై సునీల్‌రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి హరిశంకర్, సివిల్ సప్లు కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.