13 July, 2026 | 6:32 PM

పాఠశాల ఆవరణలో మహిళా సమాఖ్య భవన నిర్మాణాన్ని నిలిపివేయాలి

13-07-2026 05:42 PM

ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని ఈడులవాడ గ్రామపంచాయతీ పరిధిలోని ఎంపీపీ పాఠశాల ఆవరణలో ప్రతిపాదించిన మహిళా సమాఖ్య భవన నిర్మాణాన్ని నిలిపివేసి, ప్రత్యామ్నాయ స్థలంలో నిర్మించాలని మాజీ సర్పంచ్ బూసి భీమేష్ జిల్లా కలెక్టర్‌ కె.హరిత కు వినతిపత్రం సమర్పించారు. పాఠశాల ప్రాంగణంలో ఇప్పటికే స్థలం పరిమితంగా ఉండటంతో విద్యార్థుల ఉదయపు ప్రార్థన, క్రీడలు, ఇతర విద్యా కార్యక్రమాల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వినతిలో పేర్కొన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాల స్థలాన్ని ఆక్రమిస్తూ కొత్త భవనం నిర్మించడం విద్యార్థుల ప్రయోజనాలకు విరుద్ధమని తెలిపారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు పరిశీలించి, మహిళా సమాఖ్య భవనాన్ని గ్రామంలోని ఇతర ప్రభుత్వ స్థలంలో నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఫిర్యాదును అత్యవసరంగా పరిగణించి తగిన ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్‌ను కోరారు.