13 July, 2026 | 6:33 PM

నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి

13-07-2026 05:54 PM

ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు నిర్వహించాలి

నెలవారీ నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ 

భూపాలపల్లి,(విజయక్రాంతి): నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు నిర్వహించాలని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. నెలవారీ నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పనితీరు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, నేర నియంత్రణ చర్యలపై సమగ్ర సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు నిర్వహించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

నేరస్తులకు చట్టప్రకారం శిక్ష పడేలా పకడ్బందీగా దర్యాప్తు జరపాలని సూచించారు. అలాగే సి.సి.టి.ఎన్.ఎస్. (2.0) వ్యవస్థలో ప్రతి కేసును సకాలంలో నమోదు చేసి వివరాలను నిరంతరం నవీకరించాలని తెలిపారు. అందుబాటులో ఉన్న అన్ని సదుపాయాలను వినియోగించి పారదర్శకతను పెంచడంతో పాటు సేవల నాణ్యతను మెరుగుపరచాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాలు, సైబర్ మోసాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు గ్రామ స్థాయి వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. గంజాయి రవాణా, మట్కా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల వ్యవస్థను విస్తరించి వాటి పనితీరును పర్యవేక్షించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపట్టాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ స్థాయి పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేస్తూ విలేజ్ పోలీస్ అధికారులు ప్రజలతో మమేకమై ముందస్తు సమాచార సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నరేష్ కుమార్, డీఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.