8 May, 2026 | 2:21 AM

డ్రగ్స్ నియంత్రణ ప్రభుత్వ ప్రాధాన్యం

08-05-2026 01:50 AM
  1. మారక ద్రవ్యాల కట్టడికి ప్రజల భాగస్వామ్యం అవసరం 
  2. డీజీపీ సీవీ ఆనంద్
  3. ఈగల్ ఫోర్స్ విభాగ పనితీరును సమీక్షించిన డీజీపీ

సికింద్రాబాద్, మే 7(విజయక్రాంతి): డ్రగ్స్ నియంత్రణను ప్రభుత్వం ప్రాధాన్యత అంశం గా తీసుకుందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.  రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్నో పోలీస్ విభాగాలను సమీక్షించాల్సి ఉన్నా ప్రప్రధమంగా సమాజాన్ని పట్టిపీడిస్తు న్న మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు ఏర్పాటుచేసిన ఈగల్ ఫోర్స్ విభాగాన్ని రివ్యూ చేయాలనుకున్నట్లు డీజీపీ పేర్కొన్నారు. తెలంగాణతో పాటు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో మాదకద్రవ్యాల సరఫరా వినియోగం విశృంఖలంగా కొనసాగుతుందని, రాష్ట్రంలోని విద్యారినీ విద్యార్థుల నుంచి మొదలుకొని యువత జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్‌ను అరికట్టేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ సహకరించాలని డీజీపీ తెలిపారు.

హైదరాబాద్‌లోని ఈగల్ ఫోర్స్ ప్రధాన కార్యాలయంలో విభాగపు పనితీరును డీజీపీ సీవీ ఆనంద్ గురువారం సమీక్షించారు. ఈసందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సరఫరాను పూర్తి స్థాయిలో నిర్మూలించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే పోలీసులకు ఆదేశాలిచ్చారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కుటుంబాలను పట్టి పీడిస్తున్న ఈ మాదక ద్రవ్యాల మహమ్మారిని పూర్తి స్థాయిలో అరికట్టాలని, తద్వారా రాష్ట్రంలోని యువత తన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన పరిస్థితులను కల్పించాలన్నారు.

మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఎస్‌ఐబీ, గ్రేహౌండ్స్‌లు ఏజెన్సీలుగా పని చేశాయని, తీవ్రవాదాన్ని రూపుమాపేందుకు పోలీస్ యంత్రాంగం అంతా ఎలా కలిసి పని చేసిందో డ్రగ్స్‌ను అరికట్టేందుకు ఆ విధంగా పనిచేయాల్సి ఉందన్నారు. దీంతోపాటు సైబర్ నేరాలు, ట్రాఫిక్ సమస్యలు మన ముందు ఉన్నాయన్నారు. కొత్తగా రూపుదిద్దుకున్న ‘ఈగల్ పోర్స్’ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్) పనితీరును, గతంలోని పరిస్థితులను డీజీపీ సీవీ ఆనంద్ సమగ్రంగా సమీక్షించారు.

డ్రగ్స్ నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ఆర్థిక మూలాల అన్వేషణ, విదేశ సిండికేట్ల అణిచివేత లక్ష్యంగా ముందుకు సాగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ కమిషనరేట్లలోని నాలుగు నార్కోటిక్ పోలీస్ స్టేషన్లు, ఏడు ప్రాంతీయ సెల్స్, 20 ఎన్ఫోర్స్మెంట్ వింగ్స్ సమన్వయంతో పనిచేస్తున్న తీరును అధికారులు డీజీపీకి వివరించారు. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో డ్రగ్స్ కేసుల నమోదు గణనీయంగా పెరిగిందని 2023లో 1,464 కేసులు నమోదు కాగా, 2025 నాటికి ఆ సంఖ్య 2,734కు చేరింది.

2023లో 3,157 మందిని అరెస్ట్ చేయగా, 2025లో ఈ సంఖ్య 5,703కు పెరిగాయని తెలియజేశారు. కాగా డిజిటల్ ఫోరెన్సిక్స్, జియో లొకేషన్ ట్రాకింగ్ ద్వారా నిందితులనుపట్టుకోవాలన్నారు. నిందితులకు కన్విక్షన్ రేట్ 19% నుంచి 28%కి పెరగడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈగల్ పోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా నేతృత్వంలోని బృందాన్ని డీజీపీ అభినందించారు.