27 June, 2026 | 2:37 AM

‘స్లమ్’.. నిర్లక్ష్యం..

27-06-2026 01:53 AM
  1. అభివృద్ధికి ఆమడ దూరంలో స్లమ్ కాలనీలు
  2. స్లమ్ ప్రాంతాలపై మున్సిపాలిటీ నిర్లక్ష్యం
  3. వర్షాకాలం వస్తే కష్టాలే.. కాలనీవాసుల ఆవేదన

మధిర, జూన్ 26(విజయ క్రాంతి): మధిర పట్టణంలోని 2, 10 వార్డుల పరిధిలో ఉన్న స్లమ్ కాలనీల్లో మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో సుమారు 1,200 మంది నివాసం ఉంటుండగా, కాలనీలో మొత్తం 20 రోడ్లు ఉన్నాయి. అయితే వాటిలో కేవలం రెండు మాత్రమే సీసీ రోడ్లు కాగా, మిగిలిన 18 రోడ్లు మట్టి రోడ్లుగానే ఉండటంతో ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వర్షాకాలం ప్రారంభమయ్యే తరుణంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు నీరు రోడ్లపైనే నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో దోమలు విపరీతంగా పెరిగి చిన్నారులు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారని వారు తెలిపారు. రోడ్లు గుంతలమయంగా మారడంతో రాకపోకలు కష్టంగా మారాయి.

రాత్రివేళ కొన్ని వీధుల్లో విద్యుత్ దీపాలు వెలగక మహిళలు, విద్యార్థులు భయాందోళనల మధ్య ప్రయాణించాల్సి వస్తోందని స్థానికులు పేర్కొన్నారు. చెత్త సేకరణ కూడా ప్రతిరోజూ సక్రమంగా జరగకపోవడంతో కాలనీలు చెత్తకుప్పలుగా మారుతున్నాయని ఆరోపించారు. వర్షాలు కురిసే సమయంలో చెత్త పేరుకుపోవడంతో విషసర్పాలు, కీటకాలు కాలనీలో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని వాపోయారు.

పేదలు అధికంగా నివసించే ఈ ప్రాంతాల అభివృద్ధిపై మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో మాత్రమే హామీలు ఇచ్చి, అనంతరం సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలనీలో సీసీ రోడ్లు, పక్కా డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యం, వీధి దీపాలు, ఫాగింగ్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.