8 May, 2026 | 2:48 AM

టెండర్‌లో గోల్‌మాల్!

08-05-2026 01:51 AM
  1. సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు, రెసిడెన్షియల్, హాస్టల్ విద్యార్థులకు వస్తువుల సరఫరాలో లుకలుకలు 
  2. ఇతర రాష్ట్రాల్లోని కొన్ని కార్పొరేట్ కంపెనీలకే కట్టబెట్టేలా నిబంధనలు 
  3. గుజరాత్ కంపెనీలతో నేడో, రేపో ఒప్పందానికి రంగం సిద్ధం 
  4. రూ. 500 కోట్ల వరకు పక్కదారి!

హైదరాబాద్, మే ౭ (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మైనారిటీ, గురుకుల విద్యా సంస్థల సొసైటీ, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, బీసీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు, గిరిజన సంక్షేమ గురుకులాలు, ఆదర్శ పాఠశాలలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహా లు.. ఇలా మొత్తం 10 రకాల గురుకులాలు, పాఠశాలల్లో మొత్తం 9.24 లక్షల మంది విద్యార్థులున్నారు.

వీరికి 2026-27 విద్యా సంవత్సరానికిగాను.. 22 రకాల వస్తువులను ప్రభుత్వం అందజేసేందుకు టెండర్లు పిలిచింది. ఇం దులో ట్రాలీ బ్యాగ్‌లు, ట్రంక్ బాక్స్‌లు, యూ నిఫాం, టై, బెల్ట్, దుప్పట్లు, సాక్స్, బ్యాగ్, నోట్ పుస్తకాలు, రగ్గులు, మ్యాట్, పీటీ డ్రెస్, నైట్ డ్రెస్, ట్రాక్ సూట్ లాంటివి ఉన్నాయి. గతం లో వీటన్నింటినీ ఏ జిల్లాకు ఆ జిల్లాగా టెండ ర్లు పిలిచి.. కొనుగోలు చేసి విద్యార్థులకు అం దించేవారు.

కానీ ఇలా చేయడం వల్ల నాణ్యతలోపం, ధరల్లో హెచ్చుతగ్గులు, సరిగా సరఫ రా చేయకపోవడం లాంటివి జరుగుతున్నాయని.. తద్వారా భారీగా అక్రమాలు జరుగు తున్నాయని, దీనితో ప్రభుత్వ ఖజానాకు చిల్లు పడుతుందని ప్రభుత్వం భావించింది. దీనితో రాష్ట్రస్థాయిలో కామన్ ప్రొక్యూర్‌మెంట్ విధానంలో వీటిని కొనుగోలు చేయడానికి వీలుగా ఒక ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ)ను ఏర్పాటుచేసి రూ. 1800 కోట్లతో టెండర్లు పిలిచారు. 

జిల్లాల వారీగా కొనుగోలు చేస్తే.. అవినీతి, అక్రమాలు, నాణ్యత లో పం, ధరల్లో తేడాల కారణంగా ప్రభుత్వ ఖజానాకు చిల్లు పడుతుంది. అందుకే రాష్ట్ర స్థాయిలో కామన్ ప్రొక్యూర్‌మెంట్ విధానంలో విద్యార్థులకు ఇచ్చే వివిధ వస్తువులను టెండర్ పిలిచాం.. అంటూ చెప్పడం వరకు ఫరవాలేదు. అయితే అంతర్గతంగా మాత్రం భారీమొత్తంలో తెరవెనుక నిధులు చేతులు మారుతున్నాయనేదే ఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా కనపడుతోంది. అంటే ఉద్దేశం మంచిదే.. కానీ ఆచరణలో అక్రమాలు జరుగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తడంతో ప్ర భుత్వం ఏ దిశగా సాగుతున్నదనే చర్చ మొదలయ్యింది.

అక్రమాలకు శ్రీకారం

వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం.. ఇలాంటి టెండర్లలో 25 శాతం ఎస్సీలు, మహిళా ఎంటర్‌ప్రెన్యూర్లకు అవకాశం ఇవ్వాలి. కానీ.. మన రాష్ట్రంలోని ఉత్పత్తిదారులు, సరఫరాదారులుగానీ, రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈలకుగానీ అవకాశం రాకుండా టెండరు నిబంధనలను రూపొందించారు. దీనితో ఇతర రాష్ట్రాల్లోని కార్పొరేట్ కంపెనీలకే ఈ టెండర్లు కట్టబెట్టేలా నిబంధనలు రూ పొందించారని మొదటి నుంచి విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు అవే నిజమవుతున్నాయి.

అంతటా మౌనమే..

వాస్తవానికి ఇంతటి స్థాయిలో అక్రమాలు జరిగే అవకాశం స్పష్టంగా ఉన్నప్పటికీ.. టెం డరు అర్హతలను ఇతర రాష్ట్రాల్లోని కార్పొరేట్ కంపెనీలకే కట్టబెట్టేలా రూపొందించినప్పటికీ.. రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈలకు తీరని నష్టం వాటిల్లేలా వారికి టెండర్లు రాకుండా, వారికి అర్హతలు లేకుండా చేస్తున్నప్పటికీ.. అటు ఐఏఎస్‌లుగానీ, ఇటు మంత్రులుగానీ ఒక్కరుకూడా స్పందించలేదు. అందరూ మౌనం వహించారు. గుజరాత్ కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పుతున్నా, అదే మౌనం కనపడుతోంది.

అందరిలోనూ ఒక రకమైన భయం.. మాకెందుకు ఈ గోల.. మేమెందుకు తలదూర్చాలి. దీనివల్ల మాకేం లాభం.. అంతా.. వారే చూసుకుంటారనే ధోరణితో, ఎవరూ నోరు మెదపడంలేదని రాజకీయ వర్గాల్లోనూ చర్చ మొదలయ్యింది. ఐఏఎస్‌లు తమకు చుట్టుకోకుండా ఉంటే చాలనే విధంగా వ్యవహరిస్తే.. అనవసరంగా దీంట్లో తలదూర్చడమెందుకనే ధోరణితో మంత్రు లు ఉన్నారనే చెప్పవచ్చు.

రూ. 500 కోట్లు చేతులు మారే అవకాశం.. 

మొత్తం 9.24 లక్షల మంది విద్యార్థులకు మొత్తం 22 రకాల వస్తువులను అందించేందుకు పిలిచిన ఈ టెండర్లను ఎట్టకేలకు ఇతర రాష్ట్రాల్లోని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మొత్తం రూ. 1,800 కోట్లతో పిలిచిన ఈ టెండర్లను గుజరాత్‌కు చెందిన రెండు, మూడు కంపెనీలకే అప్పగించే పనులు పూర్తిచేసిన ప్రభుత్వం.. నేడో, రేపో ఒప్పందంకూడా కుదుర్చుకోనున్నట్టు తెలుస్తోంది.

ఈ మొత్తం తతంగంలో రూ. 500 కోట్ల వరకు చేతులు మారే అవకాశం ఉందని.. పారదర్శకంగా చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వంలోని కొందరు పెద్దలు.. లోపాయికారిగా కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందం చేసుకుని వారికే టెండర్లను కట్టబెట్టి, తెరచాటుగా.. భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

ఏ వస్తువు ధర అయినా ముందుగానే నిర్ణయించే ప్రభుత్వం.. ఈ విషయంలో మాత్రం వస్తువుల ధరలను ముందుగా నిర్ణయించకుండా, టెండర్లు పిలవడాన్ని ఎత్తి చూపుతున్నారు. దీనితో టెండరుదారులు తమ ఇష్టారాజ్యంగా ధరలను కోట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో మొత్తం టెండర్‌లో 25 నుంచి 35 శాతం అధికంగా ధరలను కోట్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో గుజరాత్‌కు చెందిన టెండరుదారులు చేజిక్కించుకున్నట్టుగా సమాచారం. 

నేరుగా పిల్లలకే ఇస్తే..

ఇలా ఒక్కో టెండర్‌లో ఒక్కో రకమైన అక్రమాలు, అవినీతి ఆరోపణలు వస్తుండటంతో.. అసలు పిల్లలకే .. వారి ఖాతాల్లోకే ప్రభుత్వం ఇవ్వాల్సిన  వస్తువుల ధరల మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేస్తే సరిపోతుందనే వాదనకూడా బలంగా వినపడుతోంది. రైతు భరోసా మాదిరిగా.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ చేయాలని, తద్వారా.. స్థానికంగా ఉండే వ్యాపారులు, యూనిఫారంతోసహా ఇతర వస్తువుల సరఫరాదారులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, అలాగే యూనిఫాం వస్త్రాన్ని తయారుచేసేవారికికూడా ఉపాధి దొరుకుతుందని మేధావులు సైతం అంటున్నారు.

అలాగే స్థానికంగా ఉండే ఎంఎ స్‌ఎంఈలకు వర్క్ ఆర్డర్లు వస్తాయని, దర్జీలు, టెయిలర్లకు దుస్తులు కుట్టే అవకాశం వస్తుందని.. వారికీ ఉపాధి కలుగుతుందని వారంటున్నారు. ఇలాంటి అవకాశాలను పరిశీలించకుండా.. ఇతర రాష్ట్రాల్లోని కార్పొరేట్ కంపెనీలకు లాభం కలిగేలా టెండరు నిబంధనలను రూపొందించి.. వారికి కట్టబెట్టి.. తెరవెనుక అక్రమానికి తెరతీశారంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత టెండర్లను రద్దుచేసి.. పారదర్శకంగా నిర్వహించి.. రాష్ట్రంలోని సుమారు 2,000 ఎంఎస్‌ఎంఈలు, ఎస్‌ఎంఈలు, అలాగే చిరువ్యాపారుకు ఉపాధి లభించేలా డీబీటీ పద్ధతిని పరిశీలించాలంటూ వారు సూచిస్తున్నారు.

మాకెందుకీ తలనొప్పి..

వాస్తవానికి సెంట్రలైజ్డ్ పద్ధతిలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ) ఏర్పాటుచేసి రూ. 1,800 కోట్ల టెండర్‌ను పిలిచినా.. టెండరు నిబంధనలను రూపొందించడంలోనే ప్రభుత్వ పెద్దల ఆంతర్యాన్ని కొందరు ఐఏఎస్‌లు గమనించినట్టుగా చర్చించుకుంటున్నారు. అందుకే పీఎంయూ చైర్మన్ అయిన ఎస్సీ గురుకులాల సొసైటీ సెక్రటరీగా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఉన్నప్పటికీ.. ఈ తతంగాన్ని గమనించి సెలవుపై వెళ్లిపోయినట్టుగా ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

దీనితో ప్రభుత్వం హడావుడిగా గ్రూప్-1 అధికారిని ఆ సీట్లో కూర్చోబెట్టి తతంగాన్ని పూర్తిచేసేందుకు రంగం సిద్దం చేసినట్టుగా సమాచారం. భవిష్యత్తులో ప్రభుత్వం మారితే.. ఈ చేతులుమారే వ్యవహారంలో ఉన్న తమ మెడకు చుట్టుకునే అవకాశం ఉందని భావించిన ఐఏఎస్‌లు  ఈ సీటు వేపు వచ్చేందుకు కూడా జంకడంతో.. ప్రభుత్వం చేసేదేమీ లేక గ్రూప్-1 అధికారి వైపు మొగ్గుచూపినట్టు చర్చించుకుంటున్నారు. నేడో, రేపో గుజరాత్ కంపెనీలతో ఒప్పందాన్ని కుదుర్చుకుని, రూ. 1,800 కోట్ల టెండర్లను కట్టబెట్టేందుకు అంతా సిద్ధం చేశారు.