అవినీతి ఇంజినీర్!
- ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టిన ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ మోహన్‌నాయక్
- 11 ప్రాంతాల్లో 16 బృందాలతో ఏసీబీ సోదాలు
- రూ.60 లక్షల నగదు, 3 కిలోల బంగారం స్వాధీనం
- హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో రూ.కోట్ల విలువ చేసే వ్యవసాయ భూముల పత్రాలు లభ్యం
- మొత్తం ఆస్తుల విలువ రూ.100 కోట్లకు పైనే..
శేరిలింగంపల్లి జూన్ 9 (విజయక్రాంతి): రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) మోహన్ నాయక్ అవినీతి బండారం ఏసీబీ సోదాలతో బయట పడింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఫిర్యాదులతో ఏసీబీ అధికారులు సోమవారం తెల్లవారు జామున హైదరాబాద్‌లోని 11 ప్రాంతాల్లో ఏకాలంలో 16 బృందాలతో ఆకస్మిక దాడులు నిర్వహించారు. మాదాపూర్‌లోని మోహన్ నాయక్ నివాసం, కార్యాల యంతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో తనిఖీలు జరిపారు. రూ.60 లక్షల నగదు, 3 కిలోల బంగారం, 35 మద్యం సీసాలు స్వాధీనం చేసుకు న్నారు.
బంగారంలో 15 బంగారు బిస్కెట్లు ఉన్నాయి. హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో కోట్లాది రూపా యల విలువైన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ పత్రా లు కూడా లభించాయి. ప్రస్తుతం లభించిన ఆస్తుల ఆధా రంగా మోహన్ నాయక్ మొత్తం ఆస్తుల విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈఎన్సీ హోదాను అడ్డం పెట్టుకుని ఆర్‌అండ్బీ శాఖలో టెండర్లు, కాంట్రాక్టుల కేటాయింపుల్లో మోహన్ నాయక్ భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.
కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల రూపంలో భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు చాలా రోజులుగా ఫిర్యాదులు అందుతున్నా యని ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఆయన ఆర్థిక లావాదేవీలపై రహస్య నిఘా పెట్టి, పక్కా సమాచారంతోనే ఈ సోదాలు చేపట్టినట్లు తెలిపారు. మోహన్ నాయక్ 2025 సెప్టెంబర్‌లో రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీగా బాధ్యతలు స్వీకరించారు.
అంతకు ముందు రాష్ట్ర రోడ్ల చీఫ్ ఇంజినీర్‌గా, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా కీలక విభాగాల్లో పని చేశారు. ఈఎన్సీగా పదోన్నతి పొంది ఏడాది కూడా పూర్తి కాకముందే ఆయనపై అవినీతి ఆరోపణలు రావడం, ఏసీబీ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది.






