రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య
- ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో ఘటన
- మృతుల స్వస్థలం వరంగల్ జిల్లా పాపాయిపేట
ఘట్ కేసర్, జూలై 3 (విజయక్రాంతి) : రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా, చెన్నారావుపేట మండలం, పాపాయిపేటకు చెందిన దంపతులు రవికుమార్, శిరీష పెద్ద అంబర్ పేట్ మున్సిపల్ పరిధిలోని కుంట్లూరులో నివాసముంటున్నారు.
గురువారం రాత్రి ఘట్ కేసర్ కు చేరుకుని ఎన్‌ఎఫ్‌సీ నగర్ సమీపంలో రైలు కిందపడి రవికుమార్, శిరీష దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న సికిందరాబాద్ రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చూస్తున్నట్లు, దంపతుల ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని రైల్వే పోలీసులు తెలిపారు.






