3 May, 2026 | 5:31 PM

పెళ్లైన రెండు నెలల్లోనే దంపతుల ఆత్మహత్య

03-05-2026 04:20 PM

హైదరాబాద్: నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లైన రెండు నెలల్లోనే దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లిలోని కుమ్మరబస్తీకి చెందిన యంజాల కార్తీక్ (28)కు నగరంలోని ప్రశాంత్ నగర్ సమీపంలోని రాజీవ్‌గాంధీ నగర్‌కు చెందిన మంజుల అలియాస్ జ్ఞానసిక (27)తో మార్చి 8న వివాహం జరిగింది. కార్తీక్ ఐటీసీలో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుండగా, మంజుల ఇటీవల వరకు ఆర్కిటెక్ట్‌గా పనిచేశారు.

ఇరు కుటుంబాల మధ్య బంధుత్వం ఉండటంతో కార్తీక్, మంజుల ఒకరినొకరు ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయాక, ఆ దంపతులు కుటుంబంలోని ఇతర సభ్యులతో కలిసి భోజనం చేసిన అనంతరం తమ గదిలోకి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం 11:30 గంటల వరకు కార్తీక్, మంజుల గదిలోంచి బయటకు రాలేదు. అంతేకాకుండా కార్తీక్ కు ఎవరు ఫోన్ చేసిన తీయకపోవడంతో అనుమనం వచ్చిన కుటుంబీకులు వారి గది తలుపులను బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా కార్తీక్ వెంటిలేటర్‌కు వేలాడుతూ, మంజుల నోటి నుండి నురుగు కారుతు మంచంపై స్పృహ కోల్పోయి పడిఉండటం కనిపించింది.

వెంటనే వారిద్దరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ నూతన దంపతులు ఆత్మహత్య చేసుకునేందుకు బలమైన కారణాన్ని వారి కుటుంబ సభ్యులు గుర్తించలేకపోయారు. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆ దంపతులు ఎంతో ఉల్లాసంగా గడిపారని, అలాగే వారి కుటుంబాల మధ్య కూడా ఎటువంటి వివాదాలు లేవని వారు తెలిపారు. శనివారం తెల్లవారుజామున ఆ ఇద్దరూ మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు.