31 August, 2026 | 10:45 PM

సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి

31-08-2026 09:35 PM

సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం విజయవంతం చేయాలి: గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్

ఆలేరు,(విజయక్రాంతి): సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఉద్యోగ జేఏసీ పిలుపు మేరకు సెప్టెంబర్ 1న నిర్వహించనున్న పెన్షన్ విద్రోహ దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి గుర్రాల బాలకృష్ణ ఉద్యోగులకు పిలుపునిచ్చారు.

సీపీఎస్ విధానం వల్ల ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రత కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేస్తామని ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించినప్పటికీ, రెండున్నరేళ్లకు పైగా గడిచినా సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. ఉద్యోగుల భవిష్యత్తు, కుటుంబాల ఆర్థిక భద్రతను దృష్టిలో పెట్టుకుని ఓపీఎస్ సాధన కోసం ప్రతి ఉద్యోగి కంకణబద్ధులై ఉద్యమంలో పాల్గొనాలని కోరారు.

ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని విడనాడి, ఉద్యోగులను ప్రభుత్వంలో మరియు సమాజంలో అంతర్భాగంగా గుర్తించి వారి న్యాయమైన హక్కులను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉద్యోగ జేఏసీ ఇచ్చే పిలుపులకు ఉద్యోగులందరూ ఐక్యంగా స్పందించి, సెప్టెంబర్ 1న నిర్వహించే పెన్షన్ విద్రోహ దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు.