31 August, 2026 | 11:42 PM

పత్తి పంటకు పురుగుల బెడద.. అప్రమత్తతే మేలు

31-08-2026 10:37 PM

వాంకిడి,(విజయక్రాంతి): పత్తి పంటలో రసం పీల్చే పురుగులు, పొగాకు లద్దె పురుగు ఉధృతి పెరగకుండా రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ విస్తరణ అధికారి రామచందర్ ఆగిడి సూచించారు. సోమవారం ఖమాన క్లస్టర్ పరిధిలోని వాంకిడి ఖుర్దు గ్రామ శివారులో పత్తి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పంట పరిస్థితిని పరిశీలించి, పురుగుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు.

ప్రస్తుతం పత్తి పంటలో పచ్చదోమ, తెల్లదోమ వంటి రసం పీల్చే పురుగుల ఉనికిని రైతులు గమనిస్తూ ఉండాలని రామచందర్ సూచించారు. వీటి నివారణకు డైఫెన్‌థియురాన్ 1.25 గ్రాములు లేదా సల్ఫాక్సాఫ్లోర్ 0.75 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. పంటను తరచూ పరిశీలిస్తూ పురుగుల ఉధృతిని గుర్తించిన వెంటనే తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు.

అదేవిధంగా పొగాకు లద్దె పురుగు పత్తి పంటను నష్టపరిచే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీని నివారణకు థయోడికార్బ్ 1.5 గ్రాములు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని తెలిపారు.పత్తి పంటలో పురుగుల ఉధృతిని ఎప్పటికప్పుడు గమనిస్తూ, అవసరాన్ని బట్టి సస్యరక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు. మందులను సూచించిన మోతాదులోనే వినియోగించాలని, పంట పరిస్థితిని బట్టి వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు పాటించాలని వ్యవసాయ విస్తరణ అధికారి రామచందర్ ఆగిడి తెలిపారు.