24 May, 2026 | 12:51 AM

డ్రగ్స్ మాఫియాపై కొరడా

24-05-2026 12:00 AM

50 రోజుల్లో 3.69 కోట్ల మత్తు పదార్థాలు స్వాధీనం, 154 మంది అరెస్టు

శేరిలింగంపల్లి, మే 23 (విజయక్రాంతి): సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై పోలీస్‌శాఖ ఉక్కుపాదం మోపింది. ఎస్‌ఓటీ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు శాంతిభద్రతల పోలీసులతో కలిసి ఏప్రిల్ 1 నుంచి మే 22 వరకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో భారీగా మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి.

ఈ 50 రోజుల వ్యవధిలో ఎన్డీపీఎస్ చట్టం కింద మొత్తం 61 కేసులు నమోదు చేశారు. 154 మంది నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.3,69,21,200 విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఓటీ డీసీపీ శోభన్ కుమార్ తెలిపారు. నిఘా వర్గాల సమాచారంతో సమన్వయంగా దాడులు నిర్వహించి డ్రగ్స్ ముఠాలను పట్టుకున్నామని వెల్లడించారు.

సంప్రదాయ గంజాయి, హాష్ ఆయిల్‌తోపాటు కొత్తగా వస్తున్న సింథటిక్ డ్రగ్స్ ముప్పును అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. యువతను మత్తుకు బానిసలను చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం పౌరుల సహకారం అవసరమని, డ్రగ్స్ విక్రయాలు, రవాణాపై విశ్వసనీయ సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.