ఆయిల్‌పామ్‌కు క్రేజ్!

14-09-2026 | 05:30am
  1. ధర ధీమాతో రైతుల ఆసక్తి
  2. ‘ఎల్ నినో’భయంతోనూ ప్రత్యామ్నాయంగా సాగు
  3. 85 వేల ఎకరాల టార్గెట్.. 1.10 లక్షల దరఖాస్తులు  
  4. అంచనాలకు మించి స్పందన 
  5. ఐదేళ్లలోనే గణనీయమైన మార్పు.. భారీగా పెరుగుదల
  6. 2.91లక్షల ఎకరాలకు విస్తరించిన సాగు   
  7. 92 వేల ఎకరాలతో భద్రాద్రి కొత్తగూడెం టాప్

హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి) : సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ రైతులు (Telangana farmers) ఆయిల్‌పామ్ (Oil palm) వైపు అడుగులు వేస్తున్నారు. గిట్టుబాటు ధర, తక్కువ పెట్టుబడి, స్థిరమైన ఆదాయం, దీర్ఘకాలిక ప్రయోజనాలు రైతులను ఆకర్షిస్తున్నాయి. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదురవుతున్న నేపథ్యంలోనూ ఆయిల్‌పామ్ సాగుపై ఆసక్తి పెరుగుతోంది.

ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, మొక్కలు, డ్రిప్ సదుపాయాలు కూడా మరింత ఊతమిస్తున్నాయి. ఫలితంగా ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యాన్ని మించి రైతుల నుంచి స్పందన వచ్చింది. 85 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యం కాగా.. ఏకంగా 1,10,000 ఎకరాలకు రైతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు.

ఇందులో 88 వేల ఎకరాల భూములను అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలించి సాగుకు  యోగ్యమైనవిగా ధ్రువీకరించారు. ఇందులో 65,350 ఎకరాలకు పరిపాలన అనుమతులు ఇవ్వగా.. 51,852 ఎకరాలకు నర్సరీ ట్యాగింగ్ పూర్తి చేశారు. 26,702 ఎకరాల్లో మొక్కల నాటడం పూర్తి చేశారు. 

టన్ను రూ.25వేలకు పైనే..

ఈ ఏడాది ఆయిల్‌పామ్ గెలలకు డిమాండ్ పెరిగింది. రైతులు నాలుగేళ్ల క్రితం సాగు చేసిన పంట చేతికొస్తుంది. టన్నుకు రూ.25వేలకు పైగా మద్దతు ధర లభించడంతో రైతులు ఈ పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా భారీగా ప్రోత్సాహకాలు అందుతున్నాయి. సబ్సిడీపై మొక్కలు, డ్రిప్ పరికరాలు, ఇతర రాయితీలతోపాటు అంతర పంటలకు కూడా అవకాశం ఉండటంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది.

మద్దతు ధర టన్నుకు 25వేలకు పైగా లభిస్తుండటం కూడా రైతులు అయిల్‌పామ్ వైపు మొగ్గు చూపుతున్నారు. వీటికి తోడు కోతులు, అడవి పందుల వంటి వన్యప్రాణుల బెడద ఉండకపోవడం కూడా కారణం. రాష్ట్రంలో ఇప్పటివరకు 2.91 లక్షల ఎకరాల్లో కొత్తగా ఆయిల్ పామ్ సాగు కావడం ఒక రికార్డు. ఆయిల్‌పామ్ సాగును1992లో ప్రారంభించగా 2021 వరకు కేవలం 40వేల ఎకరాల్లో మాత్రం సాగు చేసేందుకు రైతులు ముందుకు వచ్చారు.

గడిచిన ఐదేళ్లలో 2లక్షల ఎకరాలకు పైగా సాగైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 85వేల ఎకరాలు సాగు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాగా.. 1.10 లక్షల ఎకరాలకు దరఖాస్తులు అందడం.. పామాయిల్‌పై రైతుల ఆసక్తిని తెలియజేస్తోంది. రాష్ట్రంలోని 33 జిల్లాలకు గాను 31 జిల్లాల్లో అయిల్‌పామ విస్తరిస్తోంది.   

సాగునీటిపై ఆందోళన

వర్షాభావ పరిస్థితుల కారణంగా అధిక నీరు అవసరం ఉన్న పంటలపై రైతుల్లో ఆందోళన పెరుగుతుంది. దీంతో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి మళ్లుతోంది. ఆయిల్‌పామ్‌కు ఏడాది పొడవునా నీటి అవసరం లేకున్నా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండదు. దీంతో రైతులు ఈ పంట వైపు మొగ్గు చూపుతున్నారు.  

మూడేళ్ల నుంచి 30 ఏళ్ల వరకు దిగుబడి

రాష్ట్రంలో ఆయిల్‌పామ్ పరిశ్రమలు ఏర్పాటు కావడం, మార్కెట్ సదుపాయం, ఆశాజనకంగా ధర లభిస్తుండటంతో రైతులు ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్‌ను ఎంచుకుంటున్నారు. పంట నిర్వహణ సులభం కావడం, కూలీల సమస్య  ఉండకపోవడంతో పాటు ఒక్క సారి మొక్కలు నాటితే మూడేళ్ల నుంచి 30 ఏళ్ల పాటు నిరంతర ఆదాయం కూడా మరో కారణం. ప్రభుత్వం సమకూరుస్తున్న రాయితీలు, మార్కెటింగ్ సదుపాయం, క్రషింగ్ మిల్లుల ఏర్పాటుతో రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం.. పామాయిల్ హబ్’గా మారనుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

భద్రాద్రి జిల్లా టాప్

ఆయిల్‌పామ్ సాగులో రాష్ట్రంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రథమస్థానంలో ఉంది. 92,525 ఎకరాల్లో రైతులు ఆయిల్‌పామ్ సాగు చేశారు. 49,993 ఎకరాలతో ఖమ్మం జిల్లా రెండో స్థానంలో ఉండగా, 16,336 ఎకరాలతో  నల్లగొండ జిల్లా మూడో స్థానంలో నిలిచింది. సిద్దిపేట జిల్లాలో 16,316 ఎకరాల్లో సాగు చేశారు. రాష్ట్రంలో మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో కలిపి సాగవుతున్న 31 జిల్లాల్లో 3,17,747 ఎకరాల్లో ఆయిల్ ఫాం తోటలను రైతులు పెంచుతున్నారు.  


మరిన్ని వార్తలు