29 May, 2026 | 2:55 AM

పంట అవశేషాలే భూమికి బలం

29-05-2026 12:00 AM

వ్యవసాయం మన దేశ ఆర్థిక వ్యవస్థకు మూలాధారం. రైతు కష్టానికి ప్రతిఫలంగా పండే ప్రతి ధాన్యపు గింజ దేశానికి ఆహార భద్రతను అందిస్తుంది. అయితే పంట కోత అనంతరం పొలాల్లో మిగిలే అవశేషాలను తగలబెట్టే విధానం ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఈ చర్య రైతులకు తాత్కాలికంగా సులభమైన మార్గం లా కనిపించినా, దీనివల్ల భూసారవంతం తగ్గడం, వాతావరణ కాలుష్యం పెరగడం, మానవ ఆరోగ్యానికి ముప్పు ఏర్పడడం వంటి అనేక దుష్పరిణామాలు కలుగుతున్నాయి. అందువల్ల పంట అవశేషాలను కాల్చకుండా వాటిని సద్వినియోగం చేసుకోవడం అత్యంత అవసరం.

పంట అవశేషాలను దహనం చేయడం వల్ల కలిగే నష్టాలు అనేకం ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది భూసారం తగ్గిపోవడం. పంట అవశేషాలను కాల్చడం వల్ల నేలలో సహజంగా ఉండే సేంద్రియ పదార్థాలు నశిస్తాయి. భూమిలోని లాభదాయక సూక్ష్మజీవులు, వానపాములు, మట్టిని సారవంతంగా ఉంచే జీవవ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది.

నత్రజని, భాస్వరం, పొటాషియం, గంధకం వంటి ముఖ్య పోషకాలు గాలిలో కలిసిపోతాయి. ఒక టన్ను పంట అవశేషాల ను కాల్చడం వల్ల సుమారు 5.5 కిలోల నత్రజని, 2.3 కిలోల భాస్వరం, 25 కిలోల పొటాషియం, 1 కిలో గంధకం వృథా అవుతాయి. దీనివల్ల రైతులు అధిక మొత్తంలో రసాయన ఎరువులు వాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఫలితంగా సాగు వ్యయం పెరిగి, దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది.

ఇక రెండో నష్టం నేల జీవ వ్యవస్థ నాశ నం అవడం. పంట అవశేషాల దహనం వల్ల నేల ఉపరితల ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరిగిపోతుంది. దీని ప్రభావంతో భూమిలోని మేలు చేసే బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వానపాములు నశిస్తాయి. ఇవే నేల సారాన్ని నిల బెట్టే ప్రధాన జీవులు. మట్టిలో జీవక్రియలు తగ్గిపోవడంతో భూమి గట్టిపడుతుంది. నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతుంది. మొక్కల వేర్ల పెరుగుదల మందగిస్తుంది. మూడవది, వాయు కాలుష్యం, ఆరోగ్య సమస్యలు తలెత్తడం.

పంట అవశేషాలను కాల్చడం వల్ల కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, మీథే న్, సల్ఫర్ డైఆక్సైడ్ వంటి హానికర వాయువులు విడుదలవుతాయి. ఇవి గాలి కాలుష్యా న్ని పెంచి పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఈ పొగ కారణంగా శ్వాసకోశ వ్యాధులు, కళ్లలో మంట, దగ్గు, ఆస్తమా సమస్యలు వస్తాయి. నాలుగవది, పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడటం. పంట అవశేషాల దహ నం గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాన్ని పెంచుతుంది. ఇది గ్లోబల్ వార్మింగ్‌కు ప్రధాన కారణాల్లో ఒకటి. వాతావరణ మార్పుల వల్ల వర్షపాతం అసమానంగా మారి రైతులకు మరింత నష్టం కలుగుతుంది.

పంట అవశేషాలను కాల్చకుండా ఉపయోగించే మార్గాలు కూడా ఉన్నాయి. వీటిని చిన్న ముక్కలుగా చేసి భూమిలో కలపడం ద్వారా నేల లో సేంద్రియ కార్బన్ పెరుగుతుంది. దీనివల్ల నేల ఉరుతనం పెరుగుతుంది. నీటి నిల్వ సామర్థ్యం మెరుగవు తుంది. రసాయన ఎరువుల అవసరం తగ్గుతుంది. దిగుబడులు మెరుగుపడతాయి. అంతేకాదు, వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జ వంటి పంటల అవశేషాలను పశువుల మేతగా ఉపయోగించవచ్చు. పంట అవశేషాలతో సేంద్రియ ఎరువులు తయారు చేయవచ్చు. వర్మీ కంపోస్ట్ తయారీ ద్వారా అధిక నాణ్యత కలిగిన ఎరువు లభిస్తుంది. ఈ అవశేషాలను బయోగ్యాస్ తయారీలో ఉపయోగించవచ్చు. బయోఫ్యూయల్ ఉత్పత్తికి కూడా ఇవి ఉపయోగపడతాయి.

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు

పంట అవశేషాల దహనాన్ని నివారించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడు తోంది. ఈ మధ్యనే ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం నిర్వహించి వ్యవసాయ శాఖ విస్తృత అవగాహన కల్పించింది. సేం ద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం అందించడం, గ్రామ స్థాయిలో ప్రచార కార్యక్రమా లు, కాలుష్య నియంత్రణ చర్యలను ప్రభు త్వం తీసుకుంటున్నది. కొన్ని ప్రాంతాల్లో పంట అవశేషాలను కాల్చితే జరిమానాలు విధిస్తున్నారు.

కార్బన్ శాతం ఎక్కువ

పంట అవశేషాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్చవద్దు. పర్యావరణ హిత వ్యవసాయ పద్ధతులను అనుసరించి వాటిని కుళ్లింపజేయవచ్చు. లేదా సూపర్ ఫాస్ఫేట్‌ను వాడి అవశేషాలను త్వరగా కుళ్లింపజే యవచ్చు. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, పత్తి వంటి పంటల అవశేషాలను భూమిలో కలిపేటప్పుడు ఈ పద్ధతి ఉపయోగకరంగా ఉంటుంది. పంట అవశేషాల్లో కార్బన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల అవి సహజంగా కుళ్లడానికి ఎక్కువ సమయం పడు తుంది. సూపర్ ఫాస్ఫేట్‌లో ఉండే భాస్వరం సూక్ష్మజీవుల పెరుగుదలకు దోహదం చేస్తుంది. 

ద్రవ రూపంలోని బయో ఉత్పత్తి

అవశేషాలనను కళ్లింపజేసేందుకు ఈ పద్ధతులను అనుసరించాలి. ముందుగా పం ట కోత అనంతరం అవశేషాలను పొలంలో సమానంగా పరిచి, ఎకరానికి సుమారు 25 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ చల్లాలి. అవసరమైతే యూరియా లేదా జీవామృతం కలిపి పిచికారీ చేయవచ్చు. రోటావేటర్ లేదా కల్టివేటర్‌తో భూమిలో కలపాలి. తగినంత తేమ ఉండేలా స్వల్పంగా నీరు పెట్టాలి. ఈ విధంగా చేస్తే అవశేషాలు 20 రోజుల్లో క్రమంగా కుళ్లి సేంద్రియ ఎరువుగా మారుతాయి. ఇది సూక్ష్మజీవు లతో తయారైన ద్రవ రూపంలోని బయో ఉత్పత్తి.

వేస్ట్ డీకంపోజర్ లిక్విడ్ అనేది లాభదాయకమైన సూక్ష్మజీవులు కలిగిన జీవ ద్రావ ణం. వేస్ట్ డీకంపోజర్ క్యాప్సూల్స్ లేదా కల్చర్ 1 సీసా, బెల్లం 2 కిలోలు, 200 లీటర్ల నీళ్లు, ప్లాస్టిక్ డ్రమ్ దీని తయారీకి అవసరం. మొదట 200 లీటర్ల నీటిలో 2 కిలోల బెల్లం పూర్తిగా కరిగించాలి. అందులో వేస్ట్ డీకంపోజర్ కల్చర్ కలపాలి. ప్లాస్టిక్ డ్రమ్‌పై మూతపెట్టి నీడలో ఉంచాలి. రోజుకు ఒకసారి కర్రతో కలపాలి. 57 రోజుల్లో ద్రవం సిద్ధమవుతుంది.

పంట కోత అనంతరం ఎకరానికి 150 లీటర్ల వేస్ట్ డీకంపోజర్ ద్రవం పిచికారీ చేయాలి. అవసరమైతే 25 కిలోల సూపర్ ఫాస్ఫేట్ కలపవచ్చు. ఆ తర్వాత రోటా వేటర్ లేదా కల్టివేటర్‌తో భూమిలో కలపాలి. స్వల్పంగా నీరు పెట్టి తేమ ఉండేలా చూసుకోవాలి.

పంట అవశేషాలు వ్యర్థం కాదు, భూమికి బంగారం అనే భావన ప్రతి రైతులో పెం పొందాలి. భూమి ఆరోగ్యాన్ని కాపాడితేనే భవిష్యత్తు తరాలకు సస్యశ్యామలమైన వ్యవసాయం అందించగలం. రైతు సంక్షేమం, ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత. పంట అవశేషాలను దహనం చేయడం మానుకొని, వాటిని సద్వినియోగం చేసుకుంటే భూమి సారం పెరుగుతుంది, ఖర్చులు తగ్గుతాయి, పర్యావరణాన్ని పరిరక్షించినట్టు అవుతుంది. రైతు బాగుంటే దేశం బాగుంటుంది. కాబట్టి పంట అవశేషాల దహనాన్ని పూర్తిగా నివారిద్దాం.

వ్యాసకర్త: ఏఈవో, 9247549672

దొడ్ల వంశీకృష్ణ రెడ్డి