29 May, 2026 | 2:54 AM

ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టాలి

29-05-2026 12:00 AM

వాతావరణ ప్రభావంతో రానున్న రోజుల్లో కరువు సంభవించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకుడుగుంత ఆవశ్యకత గురించి తెలిసినప్పటికీ, చాలామంది వాటిని ఏర్పాటు చేసుకోకపోవడం శోచనీయం. ఇంకుడుగుం తలు లేకపోవడంతో వర్షపు నీరు వృథాగా పోతోంది. ఎంతసేపూ భూగర్భంలో నుంచి నీటిని తోడటమే తప్ప, భూమిలోకి నీటిని ఇంకించే చర్యలు ప్రభుత్వాలతో పాటు ప్రజలూ తీసుకోవడం లేదు.

ఇష్టమొచ్చినట్లు బోర్లు వేసి నీళ్ల వ్యాపారం చేస్తున్నా, వాటివల్ల మళ్లీ నీటి కష్టాలు తీవ్రమవుతున్నా, చెరువులు కజ్జాకు గురవుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మంచినీటి కోసం ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ప్రతి సంవత్సరం నీటి సమస్య తీవ్రరూపం దాలుస్తూనే ఉంది. ఈ దుర్భర పరిస్థితుల్ని అధికమించాలంటే, ప్రతి ఇంటా ఇంకుడుగుంత ఏర్పాటు చేయడం తప్పనిసరి. భూమిపై పడిన ప్రతి వర్షపు నీటిబొట్టును ఒడిసి పట్టి, ఇంకుడుగుంతల ద్వారా భూగర్భ జలాల నిల్వలు పెంచితేనే ఈ సమస్యను అధిగమించవచ్చు.     

- కాయల నాగేంద్ర, హైదరాబాద్