30 May, 2026 | 2:47 AM

కర్ణాటకానికి తెర!

30-05-2026 12:00 AM

ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయడంతో మూడేళ్లుగా కొనసాగుతున్న ‘కిస్సా కుర్సీ కా’ కర్ణాటకానికి తెరపడింది. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు నాయకత్వ బదిలీ సవ్యంగానే సాగడంతో డీకే శివకుమార్ కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టడం లాంఛనమే. హస్తం పార్టీ అధికారికంగా ప్రకటించనప్పటికీ, 2023లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచే సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య ‘సీట్ షేరింగ్’ ఒప్పం దం జరిగినట్టు వార్తలు వచ్చిన విషయం విదితమే.

నిరుడు నవంబర్‌లో సిద్ధరామయ్య సర్కార్‌కు రెండున్నర వసంతాలు పూర్తయిన నాటి నుంచి ఈ అంశాన్ని డీకే వర్గం ఎక్కువగా చర్చకు తీసుకొస్తూ, అధిష్ఠానంపై ఒత్తిడి కొనసాగించి, చివరికి సఫలమైంది. కాగా, రాజకీయ విశ్లేషకులు ఈ పరిణామాన్ని కేవలం అధికార బదిలీగా చూడటం లేదు. సిద్ధరామయ్య సర్కార్‌పై కొన్ని వర్గాల్లో నెలకొన్న అసంతృప్తి, వ్యతిరేకతను నిలువరించేందుకు 2028లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి కొత్త నాయకత్వాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలనే వ్యూహం ఇందులో దాగి ఉందన్న చర్చ జరుగుతున్నది. అంతేకాదు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ, గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అంతగా ప్రభావం చూపలేదు.

ఈ నేపథ్యంలో 2029 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా జాతీయ రాజకీయ వ్యూహంలో భాగంగా యువ నాయకత్వాన్ని ముందుకుతెస్తున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణ యం వెనుక కాంగ్రెస్ ఎదుర్కొన్న గత చేదు అనుభవాల ప్రభావం కూడా ఉందనే వాదనలు ఉన్నాయి. గతంలో మధ్యప్రదేశ్‌లో సింధియా, రాజస్థాన్‌లో సచిన్ పైలట్ లాంటి యువ నాయకుల తిరుగుబాటు రాజకీయ సంక్షో భాలకు దారితీసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.

అదే సమయంలో సింధియా, హిమంత లాంటి నేతలు పార్టీని వీడటంతో కాంగ్రెస్‌కు తీరని నష్టం జరిగిన సంగతి తెలిసిందే. అందుకే కర్ణాటకలో అలాంటి పరిస్థితి రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తున్నది. కాగా, కర్ణాటకలో ముఖ్యమంత్రుల మార్పు కొత్తేమీ కాదు. బీజేపీకి కూడా ఇలాంటి చరిత్ర ఉన్నది. ఆ రాష్ట్రంలో ముగ్గురు ముఖ్యమంత్రులే ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకున్నారు. గతంలో అంతర్గత విభేదాలు, కూటముల పతనం వల్ల పాలకులు మారారు. కానీ, ఈసారి కాంగ్రెస్ మాత్రం సిద్ధరామయ్యకు పట్టున్న ఓబీసీలు, దళితులు, మైనారిటీలు; డీకే శివకుమార్ సామాజికవర్గం ఒక్కళిగ తమకు మద్దతుగా నిలుస్తాయని ఆశిస్తున్నది. అయితే, ఈ మార్పు కాంగ్రెస్‌ను నిలబెడుతుందా, పడగొడుతుందా? అన్నది చూడాలి.