‘సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి
‘సరస్వతీ పుత్ర’ బిరుదాంకితులైన పుట్టపర్తి నారాయణా చార్యులు తన కాలంలో తన గురించి ఎక్కువగా చెప్పుకోలేదు కానీ, ఆ మ హా కవి గురించి గొప్పగా చెప్పుకొనేవారు ఆనాడే కాదు, ఈనాడు కూడా ఎందరో ఉన్నారు.
డా. నాగపద్మినీ‘అయ్యా’ అని పుట్టపర్తి వారి గురించి మాట్లాడుతుంటే నేను పులకరించిపోయాను. తెలంగాణలోనూ నాన్న గారిని ‘అయ్యా’ అనే సంబోధిస్తారు. నాగపద్మినీ తిరుపతిలో అన్నమయ్య జయంతి సభలో ‘అన్నమయ్య తీర్చిన అలివేలుమంగ’ అనే అంశం మీద మాట్లాడుతుంటే, ఆమె తండ్రి వారసత్వాన్ని కొనసాగించినట్లనిపించింది. నాకప్పుడు పుట్టప ర్తివారి అనర్గళమైన ఉపన్యాసమే గు ర్తుకువచ్చింది. ఇదే విషయం చెబితే ఆమె ఎంతో ఆనందపడ్డారు.
పుట్టపర్తి నారాయణాచార్యులను నేను మొదటిసారి హైదరాబాద్‌లో ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’ సభావేదికపై దర్శించాను. దేవులపల్లి రామాను జరావు సభాధ్యక్షులు. కేకే రంగనాథాచార్యులు కళాశాల ప్రధానాచార్యులు. పరిషత్తు వేదిక మీద ఏ కార్యక్రమం జరిగినా విద్యార్థులమైన మాకు అది పండుగ రోజే. పరిషత్తు వేదిక మీద పుట్టపర్తి వారు ‘శివతాండవం’ గొం తెత్తి స్వయంగా వినిపిస్తుండగా మా ఎదుట శివుడు తాండవం చేసిన అనుభూతి కలిగింది. ఆ విద్వాంసుని వాగ్గ రిమకు, ప్రతిభకు, పాండిత్యానికి, శబ్దచాతురికి, జలపాతంలా సాగే గానా నికి, జ్ఞానానికి జేజేలర్పించకుండా ఉండలేకపోయాం!
పుట్టపర్తివారి జీవితాన్ని పరికిస్తే, సంస్కృతితో సహవాసం చేసినట్లుగా కనిపిస్తుంది. వారు పద్నాలుగు భాషలను మాట్లాడగలిగిన ప్రజ్ఞాశాలి. ప ద్య, గద్య, విమర్శ, అనువాద, వ్యా ఖ్యాన ప్రక్రియల్లో పండితులు. కవితా యశస్వి, బహుభాషా తపస్వి, రాజర్షి. వారు ఏనాడూ తన సాహిత్య సృష్టిని చూసి విర్రవీగలేదు. ఏనాడూ పురస్కారాల మృగతృష్ణల వెంట పరుగులు తీయలేదు. వారు నిరంతరం తన మే ధకు పదునుపెడుతూ, చివరిదాకా రచనావ్యాసంగంలో మునిగిన రచయిత. వారిది సంగీత, సాహిత్య, నాట్యకళా రంగాల్లో అందె వేసిన చెయ్యి. వైష్ణవుడైనప్పటికీ, ‘శివతాండవం’ రచించి అపరశివులయ్యారు. వారొక సభలో ప్రసంగిస్తూ ‘నన్ను కవికాడన్నా భరిస్తాను కానీ, పండితుణ్ని కాదంటే చెల రేగిపోతాను’ అన్న మాటలను బట్టి, పుట్టపర్తివారు పాండిత్యానికెంతటి ప్రా ధాన్యం ఇచ్చారో తెలుస్తుంది.
1914లో అనంతపురంలో జన్మించిన పుట్టపర్తి శ్రీవైష్ణవ సంప్రదాయం పై తిరుగులేని అధికారం సంపాదించారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో ‘విద్వాన్’ పట్టా కోసం పరీక్షకు దరఖాస్తు చేసి, ఆ పరీక్షలో పాఠ్య గ్రంథం గా ఉన్న తన ‘పెనుగొండ లక్ష్మి’ కావ్యా న్ని చదివి పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఈ పెనుగొండ లక్ష్మి కావ్యాన్ని పుట్టపర్తివారు తమ పన్నెండవ ఏటనే రచిం చారు. ఇది వారి కావ్య రచనలలో మొదటిది. 1945లో రచించిన ‘భాష్ప తర్పణం’ స్మృతికావ్యం. వారు పొద్దుటూరులో ఉద్యోగ బాధ్యతలు నిర్వహి స్తున్నప్పుడు గడియారం వెంకటశేషశాస్త్రి (శివభారత రచయిత)తో, దుర్భా క రాజశేఖర శతావధాని (రాణా ప్రతాపసింగ్ చరిత్ర రచయిత)తో మంచి పరిచయం లభించింది.
చిన్న పిల్లల కోసం ‘రాయలనీతి కథలు’ (1953) రచించారు. అభ్యుద య భావాలతో ‘పురోగమనం’ కవితాసంపుటిని రచించారు. ‘విజయ తోర ణము’ పేరుతో పెద్ద కథలను ఒక సం పుటిగా రచించారు. వారు రచించిన ‘తులసీ రామాయణం’ (1948) అనువాద కావ్యమైనప్పటికీ అది వారిని గొ ప్ప అనువాదకునిగా సాహి త్య చరిత్రలో నిలిపింది. ఒక విధంగా ఆ కా వ్యం వారిని ఉత్తరాదివాడిని చేసింది. పుట్టపర్తివారి ఉద్యోగ జీవితం సాఫీగా సాగలేదు. అయినప్పటికీ పట్టువిడవని విక్రమార్కునిలా సాహిత్య సేవలో విక్రమించారు. జీవితానుభవాన్ని పూర్తిగా రుచి చూసిన పుట్టపర్తికి పొద్దుటూరు సమీపంలోని కుమద్వతీ నదీ తీరం ఆహ్వానం పలికింది. అక్కడ వారు ఆశ్రమ జీవితాన్ని గడుపుతూ, నైరాశ్య భావనతో, ‘పండరీ భాగవతం’ ద్విపద కావ్యాన్ని జనరంజకంగా రచించారు.
పుట్టపర్తివారి మీద అరవింద యోగి ప్రభావం ఉంది. వారు అరవిందుని ఆశ్రమంలో ఉండి లాటిన్, గ్రీక్, ఫ్రెంచి భాషలు నేర్చుకున్నారు. అరవిందుల ఆంగ్ల రచనలను ‘మెరుపులు తలుపులు’గా, ‘గీతోపన్యాసాలు’గా తెనిగించారు. అరవిందుల జీవితాన్ని ‘విప్లవ యోగీశ్వరుడు’ అనే పేరుతో ఒక గ్రంథరూపంలో ఆవిష్కరించారు. విజయనగర సామ్రాజ్య చరిత్ర ఆధారంగా ‘అస్త సామ్రాజ్యము’ అనే ప్రబంధానికి శ్రీకారం చుట్టారు. పుట్టపర్తి కొంతకాలం తిరుచానూరు విశ్వవి ద్యాలయ ఉద్యోగిగా కేరళం రాష్ట్రంలో పని చేశారు. అప్పుడే వారికి మలయాళ భాషా సాహిత్యాలతో గాఢమైన సంబంధం ఏర్పడింది. తత్ఫలితంగా వారు రాసిన వ్యాసాలు ‘భారతి’ వంటి పత్రికల్లో పుంఖానుపుంఖాలు గా ప్రచురితమయ్యాయి.
అది 1955 ప్రాంతం. కేరళం గవర్నరుగా ఉన్న తెలుగుబిడ్డ డాక్టర్ బూ ర్గుల రామకృష్ణారావుతో పుట్టపర్తికి మంచి పరిచయం ఏర్పడింది. బూ ర్గుల వారి ప్రేరణతోనే పుట్టపర్తి నారాయణాచార్యులు, విశ్వనాథ సత్యనా రాయణ రచించిన ‘ఏకవీర’ను మలయాళ భాషలోకి అనువదించారు. అప్పుడది ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యగ్రంథమైంది.
మన తెలుగువాడైన భారత ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తోను, లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న మాడభూషి అనంతశయనంతోనూ పుట్టప ర్తికి మంచి పరిచయం ఉంది. దేశంలో పుట్టపర్తిని గౌరవించని సాహితీవేత్తలు ఆనాడు లేరంటే అతిశయోక్తి కాదు.
శివతాండవం, జనప్రియ రామాయణం, శ్రీనివాస ప్రబంధం మొద లైన రచనలతో తెలుగువారికి అత్యంత ఇష్టపాత్రుడిగా నిలిచిన పుట్టపర్తి సా హిత్య జీవితం మనకు ఆదర్శప్రాయమైంది.
పొద్దుటూరుతో పుట్టపర్తివారికున్న అనుబంధాన్ని పురస్కరించుకొని, నగ రంలో వారి శిష్యుడు జింకా సుబ్రహ్మ ణ్యం 2018లో ఆ సరస్వతిపుత్రుని ఏడున్నర అడుగుల కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు. నేను పొద్దుటూరుకు వెళ్లినప్పుడల్లా, ఆ విగ్రహం దగ్గరికి వెళ్లి నివాళులర్పిస్తుంటాను.
వ్యాసకర్త సెల్: 9885654381






