20 July, 2026 | 5:38 PM

Breaking News

శ్రీ ఉమామహేశ్వరం ఆలయ అభివృద్ధికి దాతల చేయూత   •   మున్సిపాలిటీలోనూ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి   •   సింగరేణి డిస్పెన్సరీని పునఃప్రారంభించిన డైరెక్టర్ (పి&పి) కె. వెంకటేశ్వర్లు   •   ముద్దసాని దామోదర్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివి   •   మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి   •   తెలంగాణ రక్షణ సమితిలో చేరిన మండల యువకులు   •   చిన్నకల్వల సింగిల్ విండో చైర్మన్ గా మురళీధర్ రావు బాధ్యతల స్వీకరణ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి   •   ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన   •  

తరతరాలకు అక్షర స్ఫూర్తి దాశరథి

20-07-2026 12:00 AM

22న దాశరథి కృష్ణమాచార్యుల జయంతి :

తెలంగాణ సాయుధ పోరాట కాలంలో నైజాం పాలనకు వ్యతిరేకంగా కలమెత్తిన ధిక్కార కవిగా పేర్గాంచిన మహనీయుడు దాశరథి కృష్ణమాచార్యులు. 80 ఏళ్ల క్రితమే తెలంగాణ ప్రాంత అస్తిత్వం, హక్కుల కోసం పోరాడిన ధీశాలి. ‘నా తెలంగాణా.. కోటి రతనాల వీణ‘ అని ఎలుగెత్తి చాటిన అక్షర యోధుడు. నాటి ప్రజా ఉద్యమానికి స్ఫూరివంతమైన బాటలు వేసిన సూరీడు. దాశరథి 1925 జులై 22న జన్మించారు. ఆయన స్వస్థలం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని చిన్నగూడూరు.

సనాతన సంప్రదాయ వైష్ణవ కుటుంబానికి చెందిన వేంకటమ్మ, వేంకటాచార్య దంపతుల జ్యేష్ఠ పుత్రుడు దాశరథి. ఈయన సోదరుడే ప్రముఖ కవి, పండితుడు దాశరథి రంగాచార్య. తండ్రి వేంకటాచార్య గొప్ప పండితుడు. తల్లి వేంకటమ్మ హరికథా భాగవతారిణి. తల్లిదండ్రుల స్ఫూర్తి తో దాశరథి కృష్ణమాచార్యులు చిన్ననాటే వ్యాకరణ సహిత ఛందోబద్ధ కవితలు రాశాడు. ఆ రోజుల్లోనే ఉర్దూలో మెట్రిక్యులేషన్ పూర్తి చేశాడు. భోపాల్ విశ్వవిద్యాలయంలో ఇంటర్మీడియట్ చదివాడు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఏ పట్టా పొందాడు. తెలుగు, ఉర్దూ భాషల్లోనే కాకుండా సంస్కృతం, ఆంగ్లంలోనూ మంచి పట్టు సాధించాడు. ఆధునిక భావాలు కలిగిన దాశరథి ఎల్లప్పుడూ ప్రజాపక్షమే నిలిచాడు. నిజాం నవాబు అరాచక, అవినీతి పాలనను ఆయన తీవ్రంగా నిరసించారు. నిజాం జాగిర్దారీ నిరంకుశ విధానాలను ప్రతిఘటించాడు. స్వయంగా ఉద్యమాల్లో పాల్గొన్నాడు. సంవత్సరాల పాటు కఠినమైన జైలు జీవితం అనుభవించాడు. 

నిజాం పాలనకు సింహస్వప్నం

1947లో నాటి ప్రజానీకం జరిపిన నిజాం వ్యతిరేక ప్రజా స్వాతంత్య్ర ఉద్యమంలో దాశరథి చురుగ్గా పాల్గొన్నాడు. తద్వారా నిజాం ప్రభుత్వానికి సింహస్వప్నంగా మారాడు. ఫలితంగా వరంగల్, నిజామాబాద్, చంచల్‌గూడ జైళ్లలో బందీగా ఉన్నాడు. నిజామాబాద్ జైలులో ఉన్నప్పుడు పళ్లు తోముకునే బొగ్గునే కలంగా మార్చుకున్నాడు. జైలు గోడలపై కవిత ధారలు పొంగించాడు. ‘ఓ నిజా ము పిశాచమా! కానరాదు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని’ అంటూ నిరంకుశత్వంపై విరుచుకుపడ్డాడు.

‘మా నిజాం రాజు తరతరాల బూజు.. ముసలి నక్కకు రాచరికమా?’ అంటూ నిలదీశాడు. ఈ తిరుగుబాటుకు గాను జైలు అధికారుల చేతిలో ఆయన దెబ్బలు తిన్నాడు. ఆ గాయాలతో ఎన్నోరోజులు విలవిలలాడా డు. అయినా ఆయన పంథా మాత్రం మార్చుకోలేదు. నిజాం పోలీసులకు పట్టుబడకుండా కొంతకాలం అజ్ఞాత జీవితం గడిపాడు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానానికి విముక్తి లభించిన తర్వాత, జైలు నుంచి దాశరథి విడుదలయ్యాడు.

అనంతరం ఉపాధ్యాయుడిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత పంచాయతీ ఇన్‌స్పెక్టర్‌గా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాడు. ఎన్ని బాధ్యతలు మోస్తున్నా, ఆయన తన రచనా వ్యాసంగాన్ని మాత్రం వీడలేదు. కథలు, నవలలు, నాటికలు, పద్యకావ్యాలు, గజల్స్.. ఇలా సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లోనూ అద్భుత రచనలు చేశాడు.

సినీ వినీలాకాశంలోనూ ముద్ర

దాశరథికి సినిమా పాటల రచనపైనా మక్కువ ఉంది. ఆయనలోని ప్రతిభను నాటి అగ్ర నటుడు ఏఎన్‌ఆర్ గుర్తించారు. ఏఎన్‌ఆర్ సిఫార్సుతో దాశరథి ‘వాగ్దానం‘ చిత్రంలో తొలి అవకాశం వచ్చింది. ఆ చిత్రంలో ‘నాకంటి పాపలో నిలిచిపోరా’ అనే గీతం రాశాడు. తర్వాత ‘ఇద్దరు మిత్రులు‘ చిత్రంలోని ‘ఖుషీ ఖుషీగా నవ్వుతూ’ అనే పాటతో శిఖరాగ్రానికి చేరుకున్నాడు. అప్పటివరకు తెలుగు సినిమా పాటల రచనలో ఒకే ప్రాంతం వారి ఆధిపత్యం ఉండేది.

దాశరథి, సీ నారాయణరెడ్డి ప్రవేశంతో ఆ పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. ఈ క్రమంలో సినీ గీతాల రారాజుగా దాశరథి వెలిగాడు. ముఖ్యంగా ఏఎన్‌ఆర్ చిత్రాలకు ఆయన రాసిన పాటలు ఎంతో పాపులర్ అయ్యాయి. మీర్జా గాలిబ్ ఉర్దూ గజళ్లను తెలుగులోకి ‘గాలిబ్ గీతాలు‘ పేరిట అనువాదం చేశాడు. ఏఎన్‌ఆర్‌కే అంకితమిచ్చాడు. శృంగారం, ప్రేమ, భక్తి, హాస్యం, వేదాంతం, జాతీయత మేళవించిన వందలాది ఆణిముత్యాలను అందించాడు.

1978 వరకు దాదాపు ౨ వేలకు పైగా సినీ గీతాలు రాశాడు. ముఖ్యంగా ‘వీణ పాటల స్పెషలిస్ట్‌గా దాశరథికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ‘మ్రోగింది వీణ’, ‘నడిరేయి ఏ ఝాములో’, ‘గోదారి గట్టుంది’, ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’ వంటి ఎన్నో పాటలు నేటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. ఆయన రాసిన ‘ఆ చల్లని సముద్ర గర్భం’ అనే ప్రైవేటు పాట ఇప్పటికీ జగత్ప్రసిద్ధం.

అజరామర కీర్తిమూర్తి

దాశరథి కృష్ణమాచార్య కేవలం సినీ కవే కాదు, అద్భుత కావ్యాల స్రష్ట. ‘అగ్నిధార‘, ‘రుద్రవీణ‘, ‘మహాబోధి‘, ‘నాగార్జున చరిత్ర‘, ‘పునర్నవం‘, ‘కవితా పుష్పకం‘, ‘దాశరథి శతకం‘, ‘అమృతాభిషేకం‘ వంటి ఎన్నో గొప్ప కవితా సంపుటాలను వెలువరించాడు. ‘కవితా పుష్పకం‘ కావ్యానికి గాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. నిజాం వ్యతిరేక పోరాటంలో ఆయన అందించిన సేవలకు గాను 1972లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ’తామ్రపత్రం’ అందుకున్నాడు.

1981లో ఆంధ్రా విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. కేంద్ర, రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు సైతం అందుకున్నాడు. 1977 నుంచి 1983 వరకు ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా సేవలు అందించాడు. 1987 నవంబర్ 5న తన 62వ ఏట మహాభినిష్క్రమణ చేశాడు. దాశరథి భౌతికంగా మన మధ్య లేకపోయినా, తెలుగు సాహిత్య రంగంలో నిత్యనూతన సాహిత్య మాలగా చిరంజీవిగానే నిలిచి ఉంటాడు.

 వ్యాసకర్త : తాళ్లపల్లి యాదగిరిగౌడ్, 

సీనియర్ జర్నలిస్ట్,  ఫోన్: 99497 89939