20 July, 2026 | 5:38 PM

Breaking News

శ్రీ ఉమామహేశ్వరం ఆలయ అభివృద్ధికి దాతల చేయూత   •   మున్సిపాలిటీలోనూ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి   •   సింగరేణి డిస్పెన్సరీని పునఃప్రారంభించిన డైరెక్టర్ (పి&పి) కె. వెంకటేశ్వర్లు   •   ముద్దసాని దామోదర్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివి   •   మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి   •   తెలంగాణ రక్షణ సమితిలో చేరిన మండల యువకులు   •   చిన్నకల్వల సింగిల్ విండో చైర్మన్ గా మురళీధర్ రావు బాధ్యతల స్వీకరణ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి   •   ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన   •  

మానవీయ కావ్యాల శిల్పి గుర్రం జాషువా

20-07-2026 12:00 AM

24న గుర్రం జాషువా వర్ధంతి :

గుర్రం జాషువా చిన్ననాడే కుల వివక్ష రక్కసి చేతిలో దారుణమైన అవమానాలు చవి చూశాడు. ఆధిపత్య కులాల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొన్నాడు. క్షుద్బాధను దిగమింగాడు. సంస్కృత రామాయాణాది మహాభారతాలు చదువుకున్నా పండితుడనే గుర్తింపునకు నోచుకోలేదు. కటిక దారిద్య్రాన్ని అనుభవించాడు. పాండిత్యానికి తగిన కొలువైనా సాధించలేకపోయా డు. ఆ మానని గాయాల నుంచి తనలో ఒక మహాకవి ఉద్భవించాడు.

పద్యా కవితా పరిమళాలు పంచి విశ్వనరుడయ్యాడు. మానవీయ కావ్యాలు అల్లుతూ భవిష్యత్ కవులకు మార్గదర్శకుడయ్యాడు. ‘కులమతాలు గీచుకున్న గీతలు జొచ్చి పంజరాన గట్టు వడను నేను.. విశ్వనరుడను నేను’ అంటూ గర్జించాడు. కవిశేఖరుడిగా, నవయుగ కవిచక్రవర్తిగా ఎదిగాడు. గుర్రం జాషువా 1895 సెప్టెంబరు 28న ఏపీలోని గుంటూరు జిల్లా వినుకొండ తాలూక చాట్రగడ్డపాడులో వీరయ్య, లింగమ్మ దంపతులకు జన్మించాడు.

తల్లిదండ్రులు వేరువేరు కులాలకు (తండ్రి యాదవ, తల్లి మాదిగ) చెందిన వారు. ఈ నేపథ్యం ఆయనకు అవమానాల సుడిగుండంలో ముంచింది. ప్రాథమిక విద్యనభ్యసించేందుకు బడిలో చేరినప్పుడు ఉపాధ్యాయులు, తోటి పిల్లలు ఆయన్ను దూరంగా కూర్చోబెట్టి హేళన చేసేవారు. జాషువా ఆ అవమానాలకు లొంగిపోలేదు. చిన్నప్పటి నుంచే తిరగబడే మనస్తత్వాన్ని అలవర్చుకున్నాడు. ‘నాకు గురువు లు ఇద్దరు ---పేదరికం, కుల మతాల వివక్ష.

ఒకటి నాలో సహనాన్ని నేర్పితే. రెండవది నాలో ఎదిరించే శక్తి నేర్పింది ’ అని ఆయన స్వయంగా చెప్పుకొన్నా డు. జీవనం కోసం ఆయన ఎన్నో రకాల ఉద్యోగాలు చేశాడు. 1910లో ఆయ న మేరీ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. మిషనరీ పాఠశాలలో నెలకు మూడు రూపాయల జీతంతో ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఆ ఉద్యోగం పోవడంతో రాజమండ్రి వెళ్లి మూకీ సినిమాలకు ‘సినిమా వాచకుడిగా’ పనిచేశాడు.

ఆ తర్వాత గుంటూరులోని లూథరన్ ఉపాధ్యాయ శిక్షణాలయంలో పదేళ్ల పాటు, అనంతరం ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా సుదీర్ఘ కాలం పనిచేశాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ప్రచారకుడిగా, ఆ తర్వాత మద్రాస్ రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్వాహకుడిగా సేవలందించాడు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ సైతం జాషువా రచనా పటిమనను ప్రశంసించాడు. శారదాదేవి అనుగ్రహం పొందిన ఒక ‘మధుర కవి’ జాషువా అని కొనియాడాడు.

ప్రథమ శ్రేణి కవిగా జాషువాగకు గుర్తింపు లభించిన తర్వాత 1964లో ఆయనకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యత్వం కూడా లభించింది. జాషువా జీవితంలో ఎదుర్కొన్న కుల వివక్ష ఆయన హదయాన్ని తీవ్రంగా గాయపరిచింది. ఒకసారి వెంకటగిరి రాజావారి ఆహ్వానంపై నెల్లూరు వెళ్తుండగా, రైల్లో తోటి కవి ఒకరు జాషువా కవిత్వానికి ముగ్ధుడై ప్రశంసించారు. సదరు వ్యక్తి ఇంతలోనే జూషువా కులం అడిగి, తెలుసుకుని చివాలున లేచి వెళ్లిపోయాడు.

ఘటనపై కలత చెందిన జాషువా, కళకు కుల, మతాలు అంటగట్టడంపై నిలువెల్లా కన్నీరయ్యాడు. ఎంతో ఆవేదనకు గురయ్యాడు. ఒకసారి వినుకొండలో జరిగిన ఒక అవధాన సభలో జాషువా పద్యగానం చేస్తున్నప్పుడు, తక్కువ కులం వాడిని సభలోకి ఎలా రానిస్తారంటూ కొందరు ఆయన్ను అవమానించారు. అంటరానివాడని హిందువులు ఈసడిస్తే, హిందూమత సంబంధ రచనలు చేస్తున్నాడని క్రైస్తవ మతాధిపతులు ఆయన కుటుంబాన్ని బహిష్కరించారు.

ఈ వైరుధ్యాల వల్ల ఆయన క్రమంగా నాస్తికత్వం వైపు మళ్లాడు. అవమానాల గాయాల పదును వృద్ధాప్యం వరకు వెంటాడింది. జాషువా తన జీవిత కాలంలో 36 గ్రంథాలతోపాటు మరెన్నో కవితా ఖండికలను వెలువరించాడు. ఆయన రచనల్లో ‘గబ్బిలం’ సర్వోత్తమమైనదిగా నిలిచింది. కాళిదాసు ‘మేఘసందేశం’ తరహాలో సాగే ఈ కావ్యంలో గుడిలోకి ప్రవేశం లేని ఒక దళిత నేత, గుడిలో స్వేచ్ఛగా తిరిగే గబ్బిలం ద్వారా కాశీ విశ్వనాథునికి తన గోడును సందేశంగా పంపడం దీని ప్రధాన ఇతివృత్తం.

దళితుల వేదనను, సామాజిక స్థితిగతులను ఈ కావ్యం కళ్లకు కడుతుంది. అలాగే ‘క్రీస్తు చరిత్ర’, ‘ఫిరదౌసి’, ‘రుక్మిణీ కల్యాణం’, ‘వివేకానంద’, ‘జేబున్నీసా’, ‘నాగార్జునసాగరం’, ‘కాందిశీకుడు’ వంటి ఎన్నో అద్భుత కావ్యాలకు ఆయనే స్రష్ట. ‘ముంతాజ్ మహల్’, ‘సాలీడు’, ‘గిజిగాడు’ వంటి సామాన్య వస్తువుల ను తీసుకొని కూడా ఆయన కావ్య రచన చేశాడు. 

మనిషి జీవించి ఉండగా వెళ్లడానికి ఇష్టపడని స్మశానాన్ని వస్తువుగా ఎంచుకుని రాసిన ‘శ్మశానవాటిక’ ఖండకావ్యం ఎంతటి పాశాన హృదయులను కదిలిస్తుంది. ‘ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన గరగిపోయె’ అంటూ సాగే పద్యాలు చదువురాని వారి నోట సైతం ఒదిగిపోయాయి.

సమాజాన్ని వేమన వలె క్షుణ్ణంగా చదివిన కవి కాబట్టే, గుర్రం జాషువా పద్యాలు నేటికీ అక్షరంముక్క రాని పల్లెవాసుల గళం నుంచి కూడా వినిపిస్తుంటాయి. ఛీత్కారాలు ఎదుర్కొన్న చోటే, మహా సత్కారాలు పొంది, కళాప్రపూర్ణ, పద్మభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాల వరకు ఎదిగిన జాషువా ౧౯౭౧ జూలై ౨౪న కన్నుమూశాడు.

 రితిక్