12 May, 2026 | 1:57 PM

కార్మికుల పిల్లలకు డే కేర్ కేంద్రాలు

24-04-2024 01:49 AM

కోవా, ఎస్‌ఐడీబీఐ, టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటు

రాష్ట్రంలో 20 సెంటర్లను ప్రారంభించాలని లక్ష్యం

పిల్లల సంరక్షణకు ప్రత్యేక సిబ్బందికి శిక్షణ

హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): ప్రతి వస్తువు ధర ఆకాశాన్ని అంటుతున్న ప్రస్తుత రోజుల్లో భార్యాభర్తలు కలిసి ఉద్యోగాలు చేస్తే కాని గడవని పరిస్ధితి నెలకొంది. ఐటీ, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేసే భార్యాభర్తలు, తమ పిల్లలను ఆయా సంస్థలు ఏర్పాటు చేసే డే కేర్‌లో చేర్చి తమ పనులను చూసుకుంటారు. కానీ రోజు కూలీలు, కార్మికులు వాటి ఫీజులను భరించలేరు. వీరి సమస్యలకు కోవా (కాన్ఫడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రీన్యూర్స్ ఆఫ్ ఇండియా), ఎస్‌ఐడీబీఐ (స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) పరిష్కార మార్గాన్ని చూపాయి. 

నగరంలో అనేక పారిశ్రామిక సంస్థల్లో వేలాది మంది కార్మికులు పని చేస్తున్నారు. కానీ వారి పిల్లలను చూసుకునేందుకు ఆయా సంస్థలు ఎటువంటి సౌకర్యాలు కల్పించడం లేదు. దీంతో వారు అనారోగ్య పరిస్థితులు మధ్య పెరుగుతూ అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి వారి పిల్లల కోసమే ఏర్పడ్డ కొన్ని స్వచ్ఛంద సంస్థలు మేము ఉన్నామంటూ వారి పిల్లలను అక్కున చేర్చుకుంటున్నాయి. వారి తల్లిదండ్రులకు భరోసా ఇస్తున్నాయి. పారిశ్రామిక కార్మికుల కోసం అవేక్ష డే కేర్ సెంటర్లను కోవా, ఎస్‌ఐడీబీఐ ఏర్పాటు చేశాయి. ముఖ్యంగా నగరంలో పారిశ్రామికవాడలు అధికంగా ఉన్న అలకాపురి, సంతోష్‌నగర్, దుర్గానగర్, సూరారంలలో వీటిని  ఏర్పాటు చేసింది. ఇది మహిళా కార్మికుల పిల్లలకు ముఖ్యంగా సమాజంలో వెనుబడినవర్గాలకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన డే కేర్ సంస్థ. దీని నిర్వహణ వ్యయాన్ని ఎస్‌ఐడీబీఐ, టీఎస్‌ఐఐసీ, ప్రైవేట్ కార్పొరేషన్లు, సీఎస్‌ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) భరిస్తాయి. మొత్తం తెలంగాణవ్యాప్తంగా 20 డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నాయి. వీటిలో భవన నిర్మాణ కార్మికుల కోసం మొదటి డే కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు.

2022లో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, ఎస్‌ఐడీబీఐ సహకారంతో జీడిమెట్ల, చెర్లపల్లి, ఉప్పల్, కాళ్ళకల్ ప్రాంతాల్లో 4 అవేక్షడే కేర్ సెంటర్లను, అనంతరం మౌలాలీ, పాశమైలారం, జినోమ్ వ్యాలీ, కోకాపేటలోని మై హోమ్ నిషాదలలో ప్రారంభించింది. ఇప్పటివరకు వీటి ద్వారా 150 మంది మహిళలు ఆర్థికంగా స్థిరపడగా మరో 60 శాతం మంది మొదటిసారిగా ఉద్యోగాలు చేస్తున్నారు. వీటిలో అన్నిరకాల వసతులు కల్పించారు. సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల పిల్లలను చూసుకునేందుకు సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు.

అంతే కాకుండా ఒక్కో కేంద్రంలో కో ఆర్డినేటర్, సీనియర్ కేర్ టేకర్, జూనియర్ కేర్ టేకర్‌తో పాటు ఒక విజిలెన్స్ బృందం కూడా ఉంటుంది. తెలంగాణలోని 20 కేంద్రాలను పూర్తి చేసిన అనంతరం భారత్‌వ్యాప్తంగా అవేక్ష డే కేర్‌లను ఏర్పాటు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు సుమారు రూ.2 లక్షలను వ్యయం చేస్తుండగా వీటి నిర్వహణకు నెలకు రూ.40 వేల వరకు వ్యయం అవుతోంది. సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాల ద్వారా నైపుణ్యాలను సులభతరం చేయడం, వాటిని విజయవంతమైన వ్యవస్థాపకులుగా మార్చడం తద్వారా మహిళలకు సాధికారత కల్పించడం కోవా లక్ష్యం.