రూ.15 వేల కోట్లతో డీల్
- రాజస్థాన్ ఫ్రాంచైజీకి కొత్త ఓనర్
భారీ ధరకు కొన్న కల్ సోమానీ
ఐపీఎల్‌లో అతిపెద్ద డీల్‌గా రికార్డ్
ముంబై, మార్చి 24 : ఐపీఎల్ చరిత్రలోనే అతి పెద్ద ఫ్రాంచైజీ డీల్ నమోదైంది. 19వ సీజ న్ ఆరంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ అమ్మకం పూర్తయింది. ఏకంగా రూ.15,300 కోట్లకు అమెరికా వ్యాపారవేత్త కల్ సోమానీ నేతృత్వంలోని కన్సార్టియం రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకూ ఇదే పెద్ద డీల్.
గత కొన్ని రోజులుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ అమ్మకాల ప్రక్రియ జోరుగా సాగుతోంది. అయితే ఆర్సీబీ కంటే ముందే డీల్ పూర్తయింది. ప్రస్తుతం రాజస్థాన్ ఫ్రాంచైజీలో ఎమర్జింగ్ మీడియా అధినేత మనోజ్ బదాలే 65 శాతాన్ని కలిగి ఉండగా.. మిగిలిన 35 శాతాన్ని రెడ్ బర్డ్ క్యాపిటల్, లాచ్ లూన్ మర్డోక్ సొంతం చేసుకున్నారు.2008లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని రూ.556 కోట్లకు కొనుగోలు చేశారు.
అదే సీజన్ లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రాయల్స్ ఛాంపియన్‌గా నిలిచింది. తర్వాత రెండో టైటి ల్ గెలవకున్నా టీమ్ బ్రాండ్ వాల్యూ మాత్రం భారీగా పెరుగుతూనే ఉంది. రాయల్స్ అమ్మకం ప్రక్రియ గత ఏడాది చివరిలో మొదలైంది. ది రెయిన్ గ్రూపు దీనిని పర్యవేక్షించింది. ఐపీఎల్‌కు ఉన్న పాపులారిటీ దృష్ట్యా ఆదిత్య బిర్లా గ్రూపు , టైమ్స్ గ్రూపు వంటి పెద్ద సంస్థలు ఆసక్తి చూపించినా రేసులో వెనుకబడ్డాయి. గతంలోనే రాజస్థాన్ ఫ్రాంచైజీలో వాటా ఉన్న సోమానీ కన్సార్టియం గ్రూపులో ఉన్న మిగిలిన వ్యాపారవేత్తలను ఒప్పంచి డీల్ ముగించారు. ప్రస్తుతానికి ఒప్పంద ప్రక్రియ ప్రాథమికంగా పూర్తయినట్టు తెలుస్తోంది.
అయితే ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాతే ఫ్రాంచైజీని పూర్తిగా కన్సార్టియం గ్రూపుకు అప్పగించనున్నారు. అమెరికాకు చెందిన సోమానీ ఎడ్యుటెక్ , ఏఐ, స్పోరట్స్ టెక్నాలజీ వంటి రంగాల్లో కీలక పెట్టుబడులు పెట్టి పెద్ద వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. ఈ కన్సార్టియం గ్రూపులో సోమానీతో పాటు వాల్ మార్ట్ కుటుంబానికి చెందిన వ్యాపారవేత్త రాబ్ వాల్టన్ , అమెరికాలో మరో పెద్ద వ్యాపార కుటుంబం హంప్ కూడా భాగస్వాములుగా ఉన్నారు.




