జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లాభంలో 64% క్షీణత
రూ.3,664 కోట్ల నుంచి రూ.1,299 కోట్లకు
న్యూఢిల్లీ, మే 17: జేఎస్‌డబ్ల్యూ స్టీల్ నికరలాభం 2024 మార్చితో ముగిసిన క్యూ4లో భారీగా తగ్గింది. గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే రూ.3,664 కోట్ల నుంచి రూ.1,299 కోట్లకు పడిపోయింది. కంపెనీ ఆదాయం సైతం స్వల్ప తగ్గుదలతో రూ.46,269 కోట్ల వద్ద నిలిచింది. నిరుడు ఇదేకాలంలో రూ.46,962 కోట్ల నికరలాభాన్ని నమోదుచేసింది. శుక్రవారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.730 చొప్పున డివిడెండు సిఫార్సుచేసింది. కంపెనీ ఏజీఎం జరిగిన తేదీ నుంచి 30 రోజులలోపు డివిడెండు చెల్లించనున్నట్టు జేఎస్‌డబ్ల్యూ స్టీల్ తెలిపింది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ రూ.6,124 కోట్ల ఇబిటాను నమోదుచేయగా, 13.2 శాతం ఇబిటా మార్జిన్‌ను కనపర్చింది. కోకింగ్ కోల్ వ్యయాలు పెరిగినందున ఆపరేటింగ్ లాభం తగ్గిందని కంపెనీ తెలిపింది.






