5 July, 2026 | 2:05 PM

కురుమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య వర్ధంతి

05-07-2026 01:31 PM

బోధన్,(విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలను బోధన్ పట్టణ కురుమ సంఘం, ఐటీ వింగ్స్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి మాట్లాడుతూ.. నైజాం నిరంకుశ పాలనకు, భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో దొడ్డి కొమరయ్య చూపిన ధైర్యం, చేసిన త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు.

వెట్టిచాకిరి విముక్తి కోసం ప్రాణాలర్పించిన ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ​కురుమల సంక్షేమం, హక్కుల సాధన కోసం సమిష్టిగా ముందుకు సాగడమే కొమరయ్యకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. అనంతరం ఐటీ వింగ్స్ ఆధ్వర్యంలో పేద విద్యార్థినికి ఒక సైకిల్, మరో 40మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తూము శరత్ రెడ్డి, కురుమ సంఘం ప్రతినిధులు, నిర్వాహకులు పెంట శ్రీనివాస్, జె. శ్రీనివాస్, మల్లేష్, పెంట రాజ్ కుమార్, శివకుమార్, శంకర్, సుశాంత్, అనుదీప్, కురుమ సంఘం బోధన్ అధ్యక్షులు వీరయ్య, గంగాధర్, మండల అధ్యక్షులు మేడి రవి, శంకర్, యువకులు తదితరులు పాల్గొన్నారు.