30 August, 2026 | 7:15 PM

సమాజ ప్రగతికి యువత తమ ప్రతిభను వినియోగించాలి

30-08-2026 06:44 PM

శివ శివాని డిగ్రీ కళాశాలలో ఘనంగా సమవర్తన–2026

దాదాపు 700 మంది పట్టభద్రులకు డిగ్రీ పట్టాల ప్రదానం

కుత్బుల్లాపూర్, ఆగష్టు 30(విజయక్రాంతి): సమాజ అభివృద్ధి, దేశ ప్రగతికి యువత తమ ప్రతిభను వినియోగించాలని శివ శివాని గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ దీపికా సంపతి పిలుపునిచ్చారు. కొంపల్లిలోని శివ శివాని డిగ్రీ కళాశాల (అటానమస్)లో రెండో సమావర్తన–2026 కార్యక్రమం ఆదివారం కొంపల్లి లోని హైదవ్ గౌరిక్ కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా వివిధ కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన దాదాపు 700 మంది పట్టభద్రులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ బి. సుధాకర్ రెడ్డి గౌరవ అతిథిగా హాజరై పట్టాలను అందజేశారు. అనంతరం ప్రొఫెసర్ బి. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తమ విద్యా జ్ఞానాన్ని సమాజ అభివృద్ధికి వినియోగిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

వేగంగా మారుతున్న ప్రపంచంలో డిగ్రీతోనే విద్య పూర్తయినట్లు భావించకుండా, నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవడంతో పాటు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకోవాలన్నారు. కార్యక్రమానికి శివ శివాని గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ అధ్యక్షురాలు ఎస్. ఆరతి అధ్యక్షత వహించారు.

ఆమె మాట్లాడుతూ విద్యార్థులు సాధించిన విజయం వారి కృషి, పట్టుదలతో పాటు తల్లిదండ్రులు, అధ్యాపకుల సహకారానికి ప్రతిఫలమని అన్నారు. డిగ్రీ పట్టా విద్యా ప్రయాణంలో ఒక మైలురాయి మాత్రమేనని, జీవితంలో కొత్త అవకాశాలకు ఇది ఆరంభమని పేర్కొన్నారు.వివిధ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ ర్యాంకులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేసి వారి విద్యా ప్రతిభను అభినందించారు.ఈ కార్యక్రమం లో వివిధ సంస్థల అధిపతులు, విభాగాధిపతులు,బోధన సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు