కేజ్రీవాల్, కవిత అరెస్టుతో తీవ్ర చర్చ
మీడియా దృష్టి మొత్తం ఈ కేసుపైనే
రంగంలోకి కేజ్రీవాల్ సతీమణి సునీత
అంతర్జాతీయంగా చర్చకు లేవనెత్తిన అరెస్టులు
దక్షిణాదిలో కవిత అరెస్టుపై పెద్ద ఎత్తున చర్చ
న్యూఢిల్లీ, మార్చి 27: ఎన్నికల వేళ ఢిల్లీ లిక్కర్ స్కాం రాజకీయ దుమారం రేపుతున్నది. ఒకవైపు దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచా రం జోరుగా సాగుతుండగా, అంతకంటే సం చలనాత్మకంగా లిక్కర్ కేసు రోజు కో మలు పు తిరుగుతున్నది. ఇదే సమయం లో ప్రతిపక్ష నేతలపై ఈడీ సోదాల దూకుడు అంత కంతకూ పెరుగుతున్నది. ఈ కేసులో ఇటీవలే అరెస్టయిన ఢిల్లీ సీఎం, ఆమ్‌ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నుంచే పరిపాలన సాగిస్తున్నారు. భర్త అరెస్టుతో తెరపైకి వచ్చిన కేజ్రీవాల్ భార్య సునీత.. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మరోవైపు లిక్కర్ కేసు రాజకీయ కక్షసాధింపు మాత్రమే అన్న విపక్షాల వాదనలకు విదేశాల నుంచి మద్దతు పెరుగు తున్నది. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన వెంటనే జర్మనీ స్పందించి పారదర్శకంగా విచారణ జరగాలని ప్రకటన చేసింది. అదే బాటలో అమెరికా కూడా మరో ప్రకటనే విడుదల చేసింది. దీనిపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
రెండేళ్లుగా సాగుతున్న కేసు
ఢిల్లీ లిక్కర్ కేసు రెండేండ్ల నుంచి నడుస్తున్నది. ఈ కేసులో గతంలోనే ఆప్ నేతలు సంజయ్‌సింగ్, మనీశ్ సిసోడియాను ఈడీ అరెస్టు చేసి జైలుకు పంపింది. కుట్రకు ప్రధాన కారణమని, సౌత్‌గ్రూప్‌కు బాధ్యురాలిని చేస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపారు. కవిత అరెస్టుపైనే దక్షిణాదిలో తీవ్ర చర్చ జరుగుతోంది. మీడియా అటెన్షన్ మొత్తం కవిత అరెస్టు చుట్టే తిరుగుతోంది. అయితే, లిక్కర్ పాలసీ రూపకల్పనలో మనీలాండరింగ్ జరిగిందని ఆరోపిస్తున్న ఈడీ రెండేండ్లయినా ఇప్పటివరకు కనీసం ఒక్క రూపాయి అక్రమ సొమ్మును కూడా గుర్తించలేకపోయింది. ఇదే విషయాన్ని కేజ్రీవాల్ సతీమణి ప్రశ్నించారు. ఈడీ చెబుతున్న వందల కోట్ల డబ్బు ఎక్కడ ఉన్నదంటూ నిలదీస్తున్నారు.
మీడియాకు ఫుల్ కిక్
లోక్‌సభ ఎన్నికల సమయంలోనే ఏకం గా ఓ సీఎంను అరెస్టు చేయటంతో మీడి యా దృష్టి ఇప్పుడు ఈ కేసుమీదే కేంద్రీకృతమైంది. మోదీ మూడోసారి ప్రధాని అయ్యి దేశంలో చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకు రెండేళ్ల నుంచే ప్రణాళికతో సాగుతున్నారు. ఇప్పుడు మీడియాను, ప్రతిపక్షాలను ఈడీ, సీబీఐ చుట్టూ తిప్పుతూ ఎన్నికల ప్రచారం చేసుకొంటున్నారని విపక్షాలు మండిపడుతున్నా రు.
నిను వీడని నీడను నేను..
ఇక, ఎన్నికల వేళ ప్రతిపక్ష నేతలపై ఈడీ దాడులు మరింతగా పెరుగుతున్నాయి. లిక్కర్ కేసులో పంజాబ్‌లో ఈడీ సోదాలు చేసింది. పంజాబ్‌లో కూడా లిక్కర్ కుంభకోణం జరిగిందని, అక్కడ కూడా ఈడీ దర్యాప్తు జరపాలని పంజాబ్ బీజేపీ శాఖ అధ్యక్షుడు ఈడీకి ఫిర్యాదు చేసిన వెంటనే ఈడీ రంగంలోకి దిగింది. పంజాబ్‌లో కూ డా ఆప్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఈ పరిణామాలను బట్టి చూసే ఆప్‌ను కోలుకోకుండా దెబ్బకొట్టడమే కేంద్రప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
విదేశాల ఒత్తిడి
లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన వెంటనే విదేశాలు స్పందించటం మొదలుపెట్టాయి. కేజ్రీవాల్ విషయంలో పారదర్శ కంగా వ్యవహరించాలంటూ మొదట జర్మనీ స్పందించింది. కేజ్రీవాల్‌పై విచారణ పారదర్శకంగా జరగాలని కోరుకొంటున్నట్టు ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనపై కేంద్రం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అయితే, జర్మనీ ప్రకటన చేసిన వారంలోనే అమెరికా కూడా అదేవిధమైన ప్రకటన చేసింది. కేసు విచారణ పారదర్శకంగా సాగాలని అభిప్రాయపడింది. ఈసారి కూడా కేంద్రం అమెరికా రాయబారిని పిలిచి నిరసన వ్యక్తంచేసింది. సాధారణంగా ఒక దేశ ఆంతరంగిక విషయాల్లో ఇతర దేశాలు జోక్యం చేసుకోవు. కానీ, ఈ కేసులో రెండు ప్రముఖ దేశాలు స్పందించటం విచిత్రంగా ఉన్నదని పరిశీలికులు అంటున్నారు.