ఏడాదికో ప్రధాని..

28-04-2024 12:09:06 AM

ఐదేళ్లకు ఐదుగురు ప్రధానమంత్రులు

ఇండియా కూటమిఅధికారంలోకి వస్తే ఇలాగే.. 

కాంగ్రెస్, ఇండియా కూటమిపై ప్రధాని విమర్శలు

కొల్హాపూర్, ఏప్రిల్ 27: ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే సంవత్సరానికో ప్రధానమంత్రి వస్తారంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతి వ్యతిరేక, బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందంటూ విమర్శలు చేశారు. ఎన్డీయే చేసిన రికార్డు స్థాయి అభివృద్ధితో పోటీ పడలేమన్న భయంతో ఇండియా కూటమి పార్టీలు స్ట్రాటజీని మార్చుకున్నాయని ఆరోపించారు. ఇప్పుడు జమ్ము కశ్మీర్‌లోని ఆర్టికల్ 370ని మళ్లీ తిరిగి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. శనివారం మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టాన్ని తొలగిస్తారని ఆరోపించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కనీసం మూడంకెల సీట్లు కూడా సాధించలేరని, అలాంటి వారు ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుందని ప్రశ్నించారు. ఇండియా కూటమి కనుక అధికారంలోకి వస్తే ఐదేళ్లకు ఐదుగురు ప్రధాన మంత్రులు వస్తారని జోస్యం చెప్పారు. 

వారికి దేశవిభజన కావాలి.. 

కర్ణాటక, తమిళనాడులో కాంగ్రెస్ నేతలు ప్రత్యేక దేశం కావాలని ప్రసంగాలు చేస్తున్నారని, ఛత్రపతి శివాజీ పుట్టిన నేల అయిన మహారాష్ట్ర ఇందుకు అంగీకరిస్తుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, ఇండియా కూటమి ద్వేషపూరిత రాజకీయాలు, జాతి వ్యతిరేక రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. కర్ణాటకలో ఓబీసీలలో ముస్లింలను చేర్చి రిజర్వేషన్లు కల్పించిందని, ఇలాంటి రిజర్వేషన్లనే దేశమంతా అమలు చేయాలని చూస్తోం దని తీవ్ర ఆరోపణలు  చేశారు. కాంగ్రెస్ అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని మాత్రమే కాదు కనీసం ఆహ్వానాన్ని కూడా తిరస్కరించిందన్నారు. ‘వారసత్వం హక్కుపై పన్ను విధించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇలాంటి ఆలోచన ఉన్న వారిని అధికారానికి దగ్గరికి కూడా రానివ్వొద్దు’ అని అన్నారు.