14 April, 2026 | 4:18 AM

దొడ్డిదారిన డీలిమిటేషన్

14-04-2026 12:21 AM
  1. మహిళా కోటా బిల్లు ముసుగులో కేంద్రం కుట్ర
  2. డీలిమిటేషన్‌కు రాజకీయ ప్రాతినిధ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలి 
  3. ఏఐసీసీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ

న్యూఢిల్లీ, ఏప్రిల్ ౧౩: మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డంపెట్టుకుని ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటి డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లును ఆమోదింపజేసేందుకు కుట్ర పన్నుతున్నదని ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ ఆరోపించారు. ఆయా బిల్లులను విమర్శిస్తూ ఆమె రాసిన వ్యాసం సోమవారం ఓ ప్రముఖ పత్రికలో ప్రచురితమైంది.

వ్యాసం ద్వారా ఆమె మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తప్పుబట్టారు. రాజ్యాంగంపై కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తున్నదని ఆమె ఆరోపించారు. దొడ్డిదారిన డీలిమిటేషన్ చేయడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేశారు. లోక్‌సభ స్థానాల సంఖ్య పెంచేందుకు కేవలం అంకెలు, గణాంకాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవడం సరికాదని, రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం అంశాన్నీ గుర్తించాలని అభిప్రాయపడ్డారు.

రాజకీయ సమానత్వం పాటించేలా ప్రక్రియ జరగాలని పేర్కొన్నారు. కేవలం జనాభా ప్రతిపాదికన డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే, ఇప్పటికే జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేస్తున్న దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రం రాజకీయ ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. 

కుల గణనను అడ్డుకునేందుకే

కుల గణనను అడ్డుకునేందుకు పరోక్షంగా ప్రధాని మోదీ డీలిమిటేషన్ వ్యూహాన్ని అమలు చేస్తున్నారని సోనియాగాంధీ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడమే బీజేపీ లక్ష్యమని పేర్కొన్నారు. 2021లో జరగాల్సిన జనాభా గణనను ఐదేళ్ల పాటు కావాలనే ఆలస్యం చేశారని మండిపడ్డారు.

2027 జనాభా లెక్కల ఫలితాల కోసం వేచి చూడకుండా, 2011 నాటి పాత లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలనుకోవడం రాజకీయ కుట్ర అని అభివర్ణించారు. మహిళల బిల్లు పేరుతో కేంద్ర ప్రభుత్వం ఊదరగొడుతున్నదని, కేంద్ర ప్రభుత్వానికి చేతనైతే ఓబీసీ మహిళలకూ వాటా కల్పించాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించకుండా ఏకపక్షంగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడమేంటని నిలదీశారు.