జైపూర్‌లో గోడ కూలి ముగ్గురు దుర్మరణం
జైపూర్: రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లా(Jaipur) అమీర్ ప్రాంతంలో గల తాలా మోద్ వద్ద గోడ కూలిపోవడంతో(wall collapse) కనీసం ముగ్గురు కూలీలు మరణించగా, మరో డజనుకు పైగా వ్యక్తులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. జైపూర్-ఢిల్లీ హైవేపై పంజాబ్ హోటల్ ఎదురుగా ఉన్న అరవళి ప్యాలెస్ రిసార్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ మురుగునీటి వ్యవస్థకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని, ప్రమాదం జరిగినప్పుడు అక్కడ పలువురు మహిళలతో సహా 24 మందికి పైగా కూలీలు పని చేస్తున్నారని అధికారులు వెల్లడించారు. వీరిలో చాలామంది బీహార్‌కు చెందినవారే ఉన్నారు.
జైపూర్ జిల్లా మేజిస్ట్రేట్ సందేశ్ నాయక్(Jaipur District Magistrate Sandesh Nayak) మరణాలను ధృవీకరిస్తూ, ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. జైపూర్ గ్రామీణ ప్రాంతంలోని చాంద్వాజీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అదే సమయంలో, శిథిలాలను తొలగించేందుకు, ఇంకా ఎవరైనా కార్మికులు చిక్కుకుని ఉన్నారేమోనని గాలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గోడ కూలిపోవడానికి గల కారణం ఇంకా తెలియరాలేదని, దీనిపై దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) బృందాన్ని ఘటనా స్థలానికి పంపినట్లు అధికారులు తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్త మార్చురీకి తరలించారు.






