14-02-2026 12:00:00 AM
హయత్నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ ఆందోళన
ఎల్బీనగర్, ఫిబ్రవరి 13 : అనుమతులు లేకుండా శివాజీ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తున్నారని, విగ్రహం ప్రతిష్ఠాపన దిమ్మెను శుక్రవారం ఉదయం పోలీసు బందోబస్తు మధ్యన జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చి వేశారు. మన్సూరాబాద్ డివిజన్ హయత్నగర్ ప్రాంతంలోని బొమ్మల గుడి రోడ్డు నుంచి కుంట్లూర్ రోడ్డుకు వెళ్లే ప్రధాన మార్గంలో ఉన్న శివం హిల్స్, శ్రీ దుర్గా నగర్, విష్ణు నగర్, సిరి హిల్స్, శివ గంగా కాలనీ, నంది హిల్స్, విజయ్ నగర్ కాలనీ తదితర దాదాపు 20 కాలనీల సంక్షేమ సంఘం సభ్యులు కలిసి చౌరస్తా ప్రదేశంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఇందుకోసం స్వచ్ఛందంగా చందాలు సేకరించి, కాంక్రీట్తో ఒక పిల్లర్ నిర్మించారు. అయితే, శుక్రవారం పోలీస్ సిబ్బంది భారీ బందోబస్తుతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది అక్కడికి చేరుకుని, నిర్మించిన పిల్లర్‌ను కూల్చివేశారు. సమాచారం తెలుసుకున్న మాజీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి, బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికులతో కలిసి హయత్నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, పోలీసులను వివరణ కోరారు.
సమాచారం మేరకు, అనుమతి లేకుండా నిర్మిస్తున్నారని జీహెచ్‌ఎంసీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో దిమ్మెను కూల్చివేశామని, విగ్రహ ఏర్పాటుకు తప్పనిసరిగా ముందుగా అనుమతి తీసుకోవాలని పోలీస్ అధికారులు సమాధానం ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అద్య క్షుడు వనిపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కొప్పుల నర్సిం హారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు కళ్ళెం రవీందర్ రెడ్డి, ఎల్లప్ప, అనుప రెడ్డి, వివిధ కాలనీ సంక్షేమ సంఘాల అధ్యక్షులు యాస శ్యాంసుందర్ రెడ్డి, రమేష్, మాధవరెడ్డి, కడారి యాదగిరి, రవీందర్ రెడ్డి, పీహెచ్ పీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.