విధులను నిర్లక్ష్యం చేస్తే శాఖా పరమైన చర్యలు
సాయుధ పోలీసు కార్యాలయం తనిఖీల్లో ఎస్పీ స్పష్టీకరణ
ఆదిలాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): సాయుధ పోలీసులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, అనవసరంగా గైర్హాజరైతే వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. పోలీసు సాయుధ కార్యాలయంలో ఉన్న ప్రతి ఒక్క ఆయుధాన్ని పూర్తిగా శుభ్రపరుస్తూ ఉండాలని సూచించారు. శుక్రవారం స్థానిక పోలీసు సాయుధ ముఖ్య కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేసారు.
ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి, రికార్డుల నవీకరణపై పలు సూచనలు చేశారు. అనంతరంఎస్పీ మాట్లాడుతూ.. సిబ్బంది వారికి ఉన్నటువంటి సెలవు దినాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వెంకటి, మురళి, చంద్రశేఖర్, రిజర్వ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




