ఇల్లందు ఎస్సీ బాలుర ప్రీ మెట్రిక్ వసతి గృహంలో కంప్యూటర్ల దొంగతనంపై విచారణ జరిపించాలి
పీడీయూ జిల్లా అధ్యక్షుడు బి.వీరభద్రం
ఇల్లందు, మార్చి 20, (విజయక్రాంతి): స్థానిక ఇల్లందు పట్టణ కేంద్రంలోని ఎస్సీ బాలుర ప్రీమెట్రిక్ వసతి గృహంలో 4 కంప్యూటర్లు కనిపించకుండా పోవడంపై విచారణ జరిపించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్ యూ), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించాలని లక్ష్యంతో గతేడాది బడ్జెట్ కేటాయించింది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిగా డి. అనసూర్య పనిచేసిన కాలంలో ఒక్కో వసతి గృహానికి నాలుగు కంప్యూటర్లు, ఒక టీవి, కేటాయించారు.
జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో ఇల్లందు వసతి గృహ సంక్షేమ అధికారికి అప్పగించిన నాలుగు కంప్యూటర్లు కనీసం వసతిగృహం చేరకముందే మధ్యలోనే అమ్మిన్నట్లు ఆరోపణలు వెలబడుతున్నాయి. దీనిపై సమగ్రమైన విచారణ జరిపించి సంక్షేమ అధికారి నరేష్ పై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నెలలు గడుస్తున్నా బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తున్న జిల్లా సంక్షేమ అధికారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 4 కంప్యూటర్లు కేటాయించినప్పటికీ ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడం, పవర్ సప్లై సాకెట్స్ లేకపోవడం, కంప్యూటర్లు పెట్టేందుకు టేబుల్స్ లేకపోవడంతో నూతన కంప్యూటర్లన్నీ నిరుపయోగంగా ఉన్నాయి. తక్షణమే జిల్లా అధికారులు దృష్టి సారించి ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని పిడిఎస్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ కోరుతుంది.




