20 August, 2026 | 10:22 PM

మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో మంథని అభివృద్ధికి మరింత ప్రాధాన్యం

20-08-2026 09:50 PM

చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం

పట్టణ సమస్యల పరిష్కారంపై కీలక చర్చ

మంథని,(విజయక్రాంతి): మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారం, మార్గదర్శకత్వంతో మంథని పట్టణ అభివృద్ధికి మరింత ప్రాధాన్యత ఇస్తున్నట్లు మున్సిపల్ పాలకవర్గం తెలిపింది. పట్టణంలో పారిశుద్ధ్యం, రహదారులు, తాగునీరు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొంది.

మంథని మున్సిపల్ కార్యాలయంలో గురువారం మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ అధ్యక్షతన, మున్సిపల్ కమిషనర్ ఎన్.మనోహర్ ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ హాజరై పాలకవర్గ సభ్యులతో పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, శాంతిభద్రతలు తదితర అంశాలపై చర్చించారు.

పారిశుద్ధ్యానికి 5 స్వచ్ఛ్ ఆటోలు

పట్టణ పారిశుద్ధ్య నిర్వహణను మరింత పటిష్టం చేయాలని పాలకవర్గం చేసిన విజ్ఞప్తికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సానుకూలంగా స్పందించారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక నిధుల నుంచి 5 స్వచ్ఛ్ ఆటోలు కొనుగోలు చేసేందుకు అంగీకరించారు. దీంతో మంథని పట్టణంలో చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగుపడనుందన్నారు.

ప్రజా అవసరాలకు ప్రాధాన్యం

వర్షాకాలం నేపథ్యంలో వివిధ వార్డుల్లో రహదారులపై ఏర్పడిన గుంతలను స్టోన్ డస్ట్‌తో పూడ్చడం, అంబేద్కర్ నగర్‌లో నూతన బోర్‌వెల్ ఏర్పాటు, 9వ వార్డులోని మహాలక్ష్మి దేవాలయం ఆవరణలో నూతన బోర్ మోటార్ కొనుగోలు, తాత్కాలిక మార్కెట్ వద్ద గ్రీన్ మ్యాట్ ఏర్పాటు తదితర అంశాలను కౌన్సిల్ సమావేశంలో చర్చించారు. ఆయా పనులకు సభ్యుల ఆమోదం తీసుకున్నారు.

వినాయక ఉత్సవాలు, పుష్కరాలపై ప్రత్యేక దృష్టి

మంథనిలో జరగనున్న వినాయక ఉత్సవాలు, గోదావరి పుష్కరాల సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఏసీపీ మడత రమేష్ సూచించారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు డ్రగ్స్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా పాలకవర్గ సభ్యులతో చర్చించారు.

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచనలు, సహకారంతో మంథని పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు పాలకవర్గం సమన్వయంతో పనిచేస్తుందని చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు కుర్ర లింగయ్య, నూకల కమల్, మాచిడి రాజుగౌడ్, మద్దికట్ల స్రవంతి, లైశెట్టి రజిత, మారుపాక నిహారిక, పెంటరి రాజు, వేముల లక్ష్మి, యేల్లంకి వంశీధర్ తదితరులు పాల్గొన్నారు.