20 August, 2026 | 10:31 PM

సింగరేణి పెట్రోల్ బంక్ పునరుద్ధరించాలి

20-08-2026 09:52 PM

గ్యాస్ బుకింగ్‌ను 21 రోజులకు కుదించాలి

ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి వై. రాంగోపాల్

మణుగూరు,(విజయక్రాంతి): మణుగూరు సింగరేణి ఏరియాలో కార్మికులు, అధికారుల సౌకర్యార్థం నిలిపివేసిన కంపెనీ పెట్రోల్ బంక్‌ను వెంటనే పునరుద్ధరించాలని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి కామ్రేడ్ వై. రాంగోపాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ దుర్గం రామచంద్రకు గురువారం మెమోరాండం అందజేశారు. ఎన్నో సంవత్సరాలుగా సింగరేణి కంపెనీ పెట్రోల్ బంక్ ద్వారా కార్మికులు, అధికారులు పెట్రోల్ సౌకర్యాన్ని పొందుతున్నారని తెలిపారు. నాణ్యతతో కూడిన పెట్రోల్‌ను కంపెనీ బంక్‌లో అందుబాటులో ఉంచడం వల్ల కార్మికులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదన్నారు.

ప్రస్తుతం ఆ సౌకర్యాన్ని నిలిపివేయడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. యాజమాన్యం వెంటనే స్పందించి కంపెనీ పెట్రోల్ బంక్‌ను యథావిధిగా పునరుద్ధరించి కార్మికులకు పెట్రోల్ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. అదేవిధంగా హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులకు ప్రస్తుతం 45 రోజుల తర్వాత మాత్రమే బుకింగ్ చేసుకునే అవకాశం ఉండటంతో కార్మికులు, వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారని రాంగోపాల్ తెలిపారు.

భారత్ గ్యాస్‌కు తక్కువ వ్యవధిలోనే బుకింగ్ సౌకర్యం లభిస్తున్న నేపథ్యంలో హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులకు కూడా 21 రోజులకు ఒకసారి బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ సరఫరా, గ్యాస్ బుకింగ్ సౌకర్యాలు కార్మికులు, వారి కుటుంబాలకు నిత్యావసరమైనవని, యాజమాన్యం ఈ సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అసిస్టెంట్ బ్రాంచ్ కార్యదర్శి మేకల ఈశ్వరరావు, జీఎం కమిటీ సభ్యుడు ఆవుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.