ప్లాట్ విక్రయంలో నాకేం సంబంధం?
శ్రీ రమణ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు కారెడ్ల మల్లారెడ్డి
మేడిపల్లి,(విజయక్రాంతి): తనపై ఇటీవల వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని సాలార్‌జంగ్ కంచె శ్రీ రమణ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు కారెడ్ల మల్లారెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కళాధర్ అనే వ్యక్తి తనపై అనవసరమైన ఆరోపణలు చేస్తూ తప్పుడు కేసులు పెట్టారని తెలిపారు. 1981లో సొసైటీ ఏర్పడిందని, 360 ఎకరాల్లో ప్లాట్లు చేసి విక్రయాలు చేపట్టారని తెలిపారు. అయితే 1983లో ఎన్టీఆర్ ప్రభుత్వం శ్రీ రమణ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ రద్దు చేయగా, భూమి యజమాని కూడా 90 ఎకరాలు మినహా మిగతా భూమిని ఇతరులకు విక్రయించారని తెలిపారు.
అయితే 2002లో పాత సొసైటీని రద్దు చేసి కొత్తగా పునరుద్దరించినట్లు తెలిపారు. అప్పటికే ప్లాట్లు కొన్నవారికి 90 ఎకరాల్లో సర్దుబాటు చేశామని తెలిపారు. ఇందులో భాగంగానే 2002లో సుధారాణికి ప్లాట్ నెంబర్ ఇ/173 ఇచ్చామని తెలిపారు. దానిని సదాలక్ష్మి కొనుగోలు చేశారని, ఆమె నుంచి 2013లో గైని కళాధర్ కొనుగోలు చేశారని తెలిపారు. సొసైటీ నిబంధనల ప్రకారం ఏడాదిలోపు ఇల్లు నిర్మించుకోవాలి. ఇందులో భాగంగానే గైని కళాధర్ రూమ్ ఏర్పాటు చేసుకుని కబ్జాలో ఉన్నారు.
కరెంట్ బిల్లులు, వాటర్ బిల్లులు, ప్రాపర్టీ ట్యాక్స్ సైతం క్రమం తప్పకుండా చెల్లించారని తెలిపారు. అయితే 1982లో ప్లాట్ కొనుగోలు చేసిన సుమతి నుంచి ఇదే ప్లాట్‌ను ఇటీవల రంగారెడ్డి అనే వ్యక్తి కొనుగోలు చేశారని తెలిపారు. సొసైటీ నిబంధనల ప్రకారం కబ్జాలో ఉన్న కళాధర్‌కు ప్లాట్ దక్కాల్సి ఉండగా ఓ రాజకీయ నాయకుడి ప్రోద్భలంతో ప్రస్తుతం రంగారెడ్డి ఇల్లు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
ఈ విషయంలో అనవసరంగా తనపై సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు నమోదు చేశారని తెలిపారు. అయితే గైని కళాధర్ ఇప్పటికే రాజకీయ నాయకులతో ఒప్పందం కుదుర్చుకుని 300 గజాల ప్లాట్‌లో 150 గజాలను 9 మార్చి 2026లో ఇతరులకు విక్రయించారని తెలిపారు. తనకు సంబంధంలేని విషయంలో తనపై అనవసర కేసులు పెట్టి పేరు ప్రతిష్టతలను దెబ్బతీస్తున్నారని తెలిపారు. తాను సొసైటీ నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నానని తనకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు.






