20-01-2026 12:33:13 AM
మహేశ్వరం, జనవరి 19 (విజయక్రాంతి): గ్రామాల సమగ్ర అభివృద్ధి ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్‌ఆర్) ధీమా వ్యక్తం చేశారు. రాబోయే మూడేళ్లలో గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. సోమవారం తుక్కుగూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, రాబోయే ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు శ్రేణులన్నీ సిద్ధం కావాలని కేఎల్‌ఆర్ పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీ డివిజన్లు, కందుకూరు, మహేశ్వరం మండలాల్లో పార్టీ విజయావకాశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే డివిజన్లు, మండలాల వారీగా కో-ఆర్డినేటర్లను నియమించినట్లు వెల్లడించారు. పార్టీలో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని కేఎల్‌ఆర్ స్పష్టం చేశారు.రెండు రోజుల తర్వాత క్లస్టర్ల వారీగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని, ఎవరైనా పార్టీ లైన్ దాటితే వారిపై వేటు తప్పదని హెచ్చరించారు.నాయకుల మధ్య సమన్వయం కుదిర్చి, విజయమే లక్ష్యంగా కో-ఆర్డినేటర్లు పనిచేయాలని సూచించారు.
ఫేక్ వార్తలపై అప్రమత్తత గా ఉండాలన్నారు. జీహెచ్‌ఎంసీ డివిజన్లు మరియు మండల రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను కార్యకర్తలు, ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు. అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలన్నారు. సమావేశంలో మహేశ్వరం, కందుకూరు మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, డివిజన్ల ముఖ్య నాయకులు మరియు పార్టీ సీనియర్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.